ఇకపై తుపాకుల గూడెం `సమ్మక్క బ్యారేజీ`
గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదీవాసీ వీరవనిత, వనదేవత.. ‘‘సమ్మక్క’’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
హైదరాబాద్ : గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదీవాసీ వీరవనిత, వనదేవత.. ‘‘సమ్మక్క’’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తుపాకులగూడెం బ్యారేజీకి ‘‘సమ్మక్క బ్యారేజీ’’ గా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాలని ఇఎన్సీ మురళీధర్ రావు ను సీఎం ఆదేశించారు.
గురువారం నాడు సీఎం కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించనున్నారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఆయన ప్రగతి భవన్ లో సంబంధిత అధికారులతో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులలోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటున్నదని, ఇప్పుడు మనం కట్టుకున్న బ్యారేజీలు నిండుకుండలా మారాయన్నారు.
రానున్న వర్షాకాలంలో వరద నీటి ప్రవాహం పెరుగుతుందని, ప్రాణహిత ద్వారా లక్ష్మీ బ్యారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసుకునే దిశగా..అటునుంచి కాలువలకు మల్లించే దిశగా.. నీటిపారుదల శాఖ ఇప్పటినుంచే అప్రమత్తం కావాలన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు గుంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, రైతుసమన్వయ సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, సాగునీటి శాఖ ఇఎన్సీ మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..