ఇకపై తెలంగాణలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు : సీవీ ఆనంద్
ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణలో ఏ రేషన్ దుకాణం నుంచైనా రేషన్ బియ్యం, సరుకులు తీసుకునే సరికొత్త సౌకర్యం
రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణలో ఏ రేషన్ దుకాణం నుంచైనా రేషన్ బియ్యం, సరుకులు తీసుకునే సరికొత్త సౌకర్యం రేషన్ కార్డుదారులకి అందుబాటులోకి రానుంది. ఈమేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తాజాగా ఓ ప్రకటన చేశారు. దేశంలోనే ఇది విప్లవాత్మకమైన ప్రయోగం అని సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ సరికొత్త విధానంతో రాష్ట్రంలో మొత్తం 85 లక్షల రేషన్‌కార్డుదారులకు 17 వేల షాపుల్లో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఒక ప్రాంతంలో రేషన్ కార్డు కలిగి వుండి వివిధ కారణాలతో మరో ప్రాంతానికి వలస వెళ్లిన వారికి సైతం రేషన్ పోర్టబిలిటీ ద్వారా రేషన్ బియ్యం సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. తమను ఉద్యోగులుగా గుర్తించి నెల జీతం ఇవ్వాలని రేషన్ డీలర్లు చేస్తోన్న నిరసనలపై కమిషనర్ స్పందిస్తూ.. వారికి కమీషన్ పెంచే ప్రతిపాదన ఉందని స్పష్టంచేశారు.
రేషన్ పోర్టబిలిటీ విధానాన్ని గతేడాది జూన్‌లోనే జీహెచ్‌ఎంసీ పరిధిలో 1550 షాపుల్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. గతేడాది నుంచి ఈ-పాస్ విధానం ప్రారంభించాం. 200 రేషన్ దుకాణాలకు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని దుకాణాలకు కనెక్టివిటీ వుంది. ఫిబ్రవరి, మార్చిలో అన్ని జిల్లాల్లో పోర్టబులిటీని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇప్పటికే 5 లక్షల మంది ఈ సదుపాయాన్ని వాడుకున్నారు. వలస కూలీలకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా వుంటుంది అని సీవీ ఆనంద్ తెలిపారు.
కార్డుదారులు చేయాల్సి పని:
రేషన్ కార్డు ఏ ఊరిలో వున్నా సరే.. మరో ఊరిలో రేషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు యధావిధిగానే కార్డు చివరన వున్న 6 నెంబర్లు చెప్పి, తమ వేలి ముద్రలు ఇస్తే చాలు అని కమిషనర్ వివరించారు. ఈ పథకం అమలు కోసం 10 శాతం స్టాక్‌ను అదనంగా డీలర్ల వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఈ నెలలో ఇరవై శాతం అదనపు నిల్వలు ఉండేలా చూస్తున్నాం. ఒకవేళ నిల్వలు అయిపోయినట్టయితే, ఈ-పాస్ మిషన్‌లోనే స్టాక్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అని సీవీ ఆనంద్ చెప్పారు.