వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన ఓ వృద్ధుడు వృద్ధురాలైన తన భార్యను కత్తితో పొడిచి చంపి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వృద్ధుడి దాడిలో తీవ్రంగా గాయపడిన అతడి భార్య కేదారమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. 80 ఏళ్ల వృద్ధురాలైన కేదారమ్మకు రెండు కాళ్లు విరగడంతోపాటు ఆరోగ్యం బాగోలేకపోవడంతో గత కొంత కాలంగా ఆమె మంచానికే పరిమితమైంది. దీంతో భార్యకు సేవలు చేయడం 84 ఏళ్ల కొమురయ్యకు తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. 


తనకే చేతకాని వయసులో మంచానికే పరిమితమైన తన భార్యకు సేవ చేయడం ఎలా అనే మనోవేదనతో జీవితంపై విరక్తి చెందిన కొమురయ్య ఆదివారం రాత్రి భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తాను కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొమురయ్య పరిస్థితి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎల్కతుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలైన భార్య బాగోగులు చూడలేని ధీన స్థితిలో వృద్ధుడు ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టిన వైనం స్థానికులకు కంటతడి పెట్టించింది.