తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వ్యతిరేకంగా దళిత విద్యార్థి సంఘాల నాయకులు ఓయూలో నిరుద్యోగ ఆవేదన సభను ప్రారంభించారు. ప్రగతి నివేదన సభ పట్ల తమ నిరసనను తెలుపుతూ.. ఓయూ గ్రంథాలయం నుండి ర్యాలీ ప్రారంభించి గేటు బయటకు వస్తున్న విద్యార్థులను పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ప్రస్తుతం ఓయూ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు ఈ ర్యాలీ ఆర్ట్స్ కళాశాల వరకూ కొనసాగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన స్వార్థ ప్రయోజనాల కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ సభను నిర్వహిస్తున్నారని దళిత విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. ప్రభుత్వ వైఖరి పై తీవ్ర ఆగ్రహాన్ని వారు వ్యక్తం చేశారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగానే లక్ష ఉద్యోగాల ప్రకటనను వెంటనే విడుదల చేయాలని కోరారు. కాగా.. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ప్రస్తుతం ఓయూకి చేరుకొని విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నారు. ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఇప్పటికే పలువురు దళిత విద్యార్థి నేతలను అంబర్ పేట పోలీసులు అరెస్టు చేశారు.


ప్రగతి నివేదన సభకు 25 లక్షల మంది కార్యకర్తలు హాజరుకానున్నారని వినికిడి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ట్రాక్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. దేశంలో అతిపెద్ద రాజకీయ ర్యాలీగా ఇప్పటికే ఈ సభ వార్తల్లోకెక్కింది. జాతీయ మీడియా కూడా ప్రముఖంగా ఈ సభకు చెందిన వార్తలను కవర్ చేయడం విశేషం.