OU Students Demands Congress Tickets: టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీకి ఓయూ విద్యార్థుల డిమాండ్
OU Students and HCU students Leaders Demands Congress Tickets: ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తానని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థి నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పీసీసీ సభ్యులకి విజ్ఞప్తి చేశారు.
OU Students and HCU students Leaders Demands Congress Tickets: కాంగ్రెస్ పార్టీకి టికెట్ల విషయంలో మరో సమస్య ఎదురైంది. ఇప్పటికే ముందు నుండి పార్టీకి సేవ చేస్తూ నియోజకవర్గాల ఇంచార్జులుగా ఉన్న వారు టికెట్లు ఆశిస్తుండగా.. కొత్తగా ఆయా నియోజకవర్గాల్లో వేర్వేరు పార్టీల నుండి వచ్చి చేరిన వారు సైతం టికెట్లు ఆశిస్తున్నారు. ఇదిలావుండగానే.. తాజాగా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేతలుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థి నేతల నుండి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం పోరాటం మొదలైంది. ఇది కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ తరుపున అసెంబ్లీ ఎన్నిక్లలో పోటీ చేసేందుకు మూడు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని కోరుతూ ప్రదేశ్ ఎన్నికల కమిటీ చైర్మన్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి, అలాగే టీ పీసీసీ సభ్యులు, సిఎల్పీ నేత అయిన భట్టి విక్రమార్కకు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఓయూ విద్యార్థి ఉద్యమ నేతలు మంగళవారం గాంధీభవన్‌లో కలిసి ఓ వినతిపత్రం అందించారు.
ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తానని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థి నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పీసీసీ సభ్యులకి విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ పార్టీ 2014లో ఒక ఎంపీ 3 అసెంబ్లీ టికెట్లు విద్యార్థి ఉద్యమకారులకు కేటాయించిందని, 2018లో మూడు అసెంబ్లీ టికెట్లు 30 కార్పొరేషన్ చైర్మన్ పదవులు విద్యార్థి ఉద్యమకారులకు ఇచ్చిందని చెప్పిన విద్యార్థి నేతలు.. కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి విద్యార్థి ఉద్యమకార్లకు న్యాయం చేయాలని వారు కోరారు.
వినతి పత్రం ఇచ్చిన వారిలో సత్తుపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్న కోటూరి మానవతారాయ్, చెన్నూరు నుంచి టిక్కెట్ ఆశిస్తున్న దుర్గం భాస్కర్, జనగాం నుంచి టికెట్ ఆశిస్తున్న బాల లక్ష్మి, గద్వాల నుంచి టికెట్ ఆశిస్తున్న కురువ విజయ్ కుమార్, మునుగోడు నుంచి టికెట్ ఆశిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నేత డాక్టర్ లింగం యాదవ్, కరీంనగర్ నుంచి కొనగాల మహేష్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పోరాటం చేస్తోన్న తమకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వాలని సదరు విద్యార్థి ఉద్యమాల నేతలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను కోరారు. అంతేకాకుండా ఇది ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కూడా అని గుర్తుచేసిన విద్యార్థి నేతలు.. ఆ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.