మరో రెండేళ్లలో 3 లక్షల ఐటీ ఉద్యోగాలు
ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ వార్షిక నివేదిక విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో 9.32 శాతం వృద్ధి రేటు నమోదైంది. మొత్తం రూ. 93 వేల 442 కోట్లు విలువైన ఐటీ, ఐటీఈఎస్ ఎగుమతిని సాధించినట్లు తేలింది. తాజా నివేదికను అనసరించి ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 4 లక్షల 75 వేల 308కి చేరింది.
జాతీయ వృద్ధి రేటును అధిగమించిన తెలంగాణ
ఈ సందర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ విభాగంలో ఇప్పటికే జాతీయ సగటు వృద్ధి రేటును తెలంగాణ అధిగమించిందని వెల్లడించారు. గత నాలుగేళ్లలో కొత్తగా 1.5 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చాయన్నారు. 2020 నాటికి 16 శాతం అభివృద్ధి రేటు, రూ. 1.2 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులను సాధించి 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో 3 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు లభించనున్నాయని అన్నారు.
కేటీఆర్‌కు ఇదే చివరి రిపోర్టు
ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తున్నందున ఇదే తన చివరి నివేదిక అని పేర్కొన్నారు. కొత్త వార్షిక నివేదికతో కొత్త ప్రభుత్వం ముందుకు వస్తుందని వ్యాఖ్యనించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఐటీ విభాగం పనితీరును ప్రశంసిస్తూ దీని కోసం కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు