రేవంత్ రెడ్డి vs ఉత్తమ్ కుమార్ రెడ్డి: ఉత్తమ్‌కే ఓటేసిన సోనియా గాంధీ ?
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: రేవంత్‌పై ఉత్తమ్ పంతం నెగ్గించుకున్నారా ?
హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతి పేరును ప్రకటించగా.. ఉత్తమ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వీహెచ్ వంటి పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్రంగా ఖండించారు. దీంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికే పార్టీ నేతల మద్దతు ఉందా అనే పరిస్థితి కనిపించింది.
ఇదిలావుండగా తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా హుజూర్ నగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి పేరునే ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఎన్నికల కమిటీ ఇన్‌చార్జి ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీలో రేవంత్ రెడ్డి vs ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టుగా జరిగిన అంతర్యుద్ధంలో ఉత్తమ్ కుమార్ పైచేయి సాధించాడా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడైతే పద్మావతి పేరును పార్టీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ సోనియా గాంధీ మద్దతు తెలిపారో.. అప్పుడే ఈ కోల్డ్ వార్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పైచేయి సాధించినట్టయిందని అంటున్నాయి రాజకీయ పార్టీలు.