PAGE Industries in Telangana: తెలంగాణలో పేజ్ ఇండస్ట్రీస్.. 7 వేల మందికి ఉపాధి: కేటీఆర్
PAGE Industries in Telangana: ఇబ్రహీంపట్నంలోని వైట్ గోల్డ్ స్పిన్ టెక్ పార్క్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీలో లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో పేజ్ ఇండస్ట్రీస్ తయారీ యూనిట్‌ను స్థాపించనున్నట్టు వెల్లడించారు. ఇబ్రహీంపట్నంతో పాటు సిద్దిపేట జిల్లా ములుగులోనూ 25 ఎకరాల విస్తీర్ణంలోనూ భారీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు తెలిపారు.
PAGE Industries in Telangana: వరల్డ్ ఫేమస్ అయిన జాకీ ఇంటర్నేషనల్ కంపెనీ దుస్తులను తయారుచేసే పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. సుమారు 290 కోట్ల రూపాయలతో తెలంగాణలో ఒక తయారీ యూనిట్‌ని ఏర్పాటు చేయనున్నట్టు పేజ్ ఇండస్ట్రీస్ స్పష్టంచేసింది. పేజ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వీ. గణేశ్ సంస్థ సీనియర్ ప్రతినిధి బృందంతో కలిసి బుధవారం ప్రగతి భవన్‌లో మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పేజ్ ఇండస్ట్రీస్ సంస్థ ప్రతినిధులు తమ పెట్టుబడి ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌కి వివరించారు. ఇబ్రహీంపట్నంలోని వైట్ గోల్డ్ స్పిన్ టెక్ పార్క్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీలో లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో పేజ్ ఇండస్ట్రీస్ తయారీ యూనిట్‌ను స్థాపించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణకు పేజ్ ఇండస్ట్రీస్ రాకతో 3000 మంది స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు అందించనున్నట్టు సంస్థ వెల్లడించింది.
ఇబ్రహీంపట్నంతో పాటు సిద్దిపేట జిల్లా ములుగులోనూ 25 ఎకరాల విస్తీర్ణంలోనూ భారీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు తెలిపారు. పేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం ములుగులో ఏర్పాటు చేయనున్న యూనిట్‌తో మరో 4 వేల మంది స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇండియా, ఒమన్, ఖతార్, మాల్దీవ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, యూఏఈ దేశాల్లో పేజ్ ఇండస్ట్రీస్ జాకీ ఉత్పత్తులను అమ్ముతూ ప్రపంచంలోనే ప్రముఖ గార్మెంట్స్ తయారీ కంపెనీగా ఎదిగిందనీ ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వీ. గణేశ్ తెలిపారు.
భారత ఉపఖండంతో పాటు ఇతర దేశాల్లో పేరొందిన తమ కంపెనీ ఉత్పత్తుల తయారీ కోసం తెలంగాణను ఎంచుకున్నామని అన్నారు. తెలంగాణలో వ్యాపారానికి అనుకూల వాతావరణం ఉండటమే తాము పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణం అని తెలిపారు. తెలంగాణలో తయారు కానున్న జాకీ ఉత్పత్తులతో పాటు తమకు లైసెన్స్ ఉన్న స్పీడో బ్రాండ్ ఉత్పత్తులను కూడా భారత్‌లో విక్రయించడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని గణేశ్ పేర్కొన్నారు.
తెలంగాణలో పేజ్ ఇండస్ట్రీస్ యూనిట్ల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికిగాను మంత్రి కేటీఆర్‌కి గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పేజ్ ఇండస్ట్రీస్ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. సంస్థ ప్రతినిధుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ కేంద్రంగా పేజ్ ఇండస్ట్రీస్ మరింత అభివృధ్ధి చెందాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షించారు. సంస్థ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సహాయసహకారాలు అందించనున్నట్టు మంత్రి కేటీఆర్ మరోసారి హామీ ఇచ్చారు.