హైదరాబాద్: రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ. 2,602 కోట్లు కేటాయించామని, గత ఐదేళ్ళుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారమే కారణమని, తెలంగాణకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని, కేంద్రమంత్రి పియూష్ గోయల్, అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించటం ద్వారా టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు గట్టి సంకేతమిచ్చారని, తద్వారా తెలంగాణలో బీజేపీ వేగంగా బలం పుంజుకుంటోందని, ఈ మద్యే జరిగిన  మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్, అవగాహన లోపంతోనే  వ్యాఖ్యలు చేస్తున్నారని, సీఏఏ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం  అసెంబ్లీలో తీర్మానం చేస్తామనటం బాధాకరమని అన్నారు. భారత రాజ్యాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అగౌరపరుస్తోందని, పార్లమెంట్ చేసిన చట్టాన్ని రాష్ట్రాలు వ్యతిరేకించజాలవని కపిల్ సిబల్ కూడా చెప్పారని మరోసారి గుర్తు చేశారు. శరణార్థులకు భారతదేశంలో ఆశ్రయం కల్పిస్తే తప్పేంటని, పొరుగు దేశంలో మతహింసకు గురవుతోన్న వారికి ఆశ్రయమిస్తామని పునరుద్ఘాటించారు. 


పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు మతంపై ఆదారపడిన దేశాలని, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మెప్పు కోసం సీఎం కేసీఆర్ మత రాజకీయాలు చేస్తున్నాడని, రాజకీయం కోసమే కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని పీయూష్ గోయల్ అన్నారు.  


మరోవైపు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి  కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎర్రబస్సులు మాత్రమే తెలిసిన తెలంగాణ ప్రజలకు మోదీ రైల్వే సౌకర్యాన్ని కల్పించారని, రైల్వే స్టేషన్లలో వైఫై సేవలను కల్పిస్తున్నామని, ప్రధాని మోదీ హయాంలో తెలంగాణలో 48 కొత్త రైళ్లను ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..