చార్మినార్ ప్రాంతంలో ఉద్రిక్తత.. బతుకమ్మ సంబురాలు అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని చార్మినార్ పోలీస్ స్టేషను వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని చార్మినార్ పోలీస్ స్టేషను వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించడానికి వచ్చిన బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తొలుత భద్రతా కారణాల వల్ల అక్కడ సంబురాలు నిర్వహించవద్దని కార్యకర్తలకు పోలీసులు సూచించగా వారు వినలేదు. ఈ క్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య మాటల యుద్ధం జరిగింది. తాము భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద సంబురాలు నిర్వహించే తీరుతామని మహిళా కార్యకర్తలు పట్టుబట్టడంతో చేసేదేమీ లేక పోలీసులు వారిని అరెస్టు చేశారు. తర్వాత వారిని చార్మినార్ పోలీస్ స్టేషనుకి తరలించారు.
మహిళలు స్టేషనులో కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్టేషను ప్రాంతం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలో మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పదే పదే తమకు సమాచారం అందడంతో.. పోలీసులు భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు అనుమతి లేకపోతే ఎవర్ని అక్కడకు రానివ్వడం లేదు. ఈ క్రమంలో అనుకోకుండా బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు బతుకమ్మ సంబురాల కోసమని అక్కడకు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది.
చార్మినార్ కట్టడానికి ఉన్న నాలుగు స్తంభాల్లో ఓ వైపు భాగ్యలక్ష్మీ ఆలయాన్ని కట్టడం జరిగింది. అదే స్తంభానికి మరో వైపు దర్గా కూడా ఉంది. అయితే ఈ భాగ్యలక్ష్మీ ఆలయం వల్ల చార్మినార్‌కి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని గతంలో పత్తర్ ఘట్టీ కార్పొరేటర్ మోసిన్ బిన్ అబ్దుల్లా హైకోర్టులో పిటీషన్ వేశారు. పురాతన కట్టడాలను కాపాడాలని తెలిపారు. ఈ క్రమంలో గతంలోనే పలుమార్లు హిందూ సంఘాలకు, స్థానిక ముస్లిములకు మధ్య వాగ్వివాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పోలీసులు హై ఎలర్ట్ ప్రకటిస్తూ ఉంటారు.