Hyderabad gang rape case: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల విచారణ వేగంవంతమైంది. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నారు. మే 29న జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితులంతా రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందిన వారు కావటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విపక్షాల ఆందోళనతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌లో మే 29న మధ్యాహ్నం ఓ పార్టీ అనంతరం బాధితురాలిని నిందితులు అంతా కలిసి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. సామూహిక అత్యాచారం ఘటన అనంతరం తప్పించుకుని ఇంటికి చేరిన బాధితురాలు విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబీకులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రతిపక్షాలు ఆందోళన చేసే వరకు పోలీసులు ఈ కేసు విచారణను నత్తనడకన సాగించారు. బీజేపీ నేతలు వీడియోలు విడుదల చేసి నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించటంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో హోం మంత్రి మనవడు పాలు పంచుకున్నాడని ఆరోపణలు రావటంతో కేసు సంచలనాత్మకంగా మారింది.


పోలీసుల విచారణలో తవ్వేకొద్దీ ఈ ఘటనకు సంబంధించిన ఆశ్చర్యం గొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారం అనంతరం నిందితులు మొయినాబాద్‌లోని ఓ రాజకీయ నేత ఫాంహౌజ్‌లో మద్యం సేవించినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడ్నుంచి వేర్వేరు చోట్లకు పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఆ ఫాం హౌజ్ వెనుకనే ఇన్నోవా కారును దాచిపెట్టిన నిందితులు.. ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారని.. కారుపై ఎమ్మెల్యే, ప్రభుత్వ స్టిక్కర్లు తొలగించారని విచారణలో తేలింది.


మరోవైపు బాధితురాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు. మరో ఇద్దరు నిందితుల్లో ఏ1‌గా ఎంఐఎం నేత కొడుకు సాదుద్దీన్, ఏ2గా ఎమ్మెల్యే సోదరుడి కొడుకు ఉమర్ ఖాన్‌ ఉన్నారు. ఏ1 సాదుద్దీన్‌ను అరెస్ట్ చేసినట్లు, మరో నిందితుని కోసం గాలిస్తున్నట్లు వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఇప్పటికే లభించిన ఆధారాలకు అదనంగా కావాల్సిన సాక్షాధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.


ఈ ఘటన అమ్మాయి అంగీకారంతో జరిగిందనే వాదనకు బలం చేకూరేలా సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అయితే బాలిక మైనర్ కాబట్టి.. ఆమె అంగీకారంతో జరిగినా.. ఇది చట్టప్రకారం నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. కేసులో అదనంగా అవసరమైన శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు. మరో మేజర్ నిందితుడు ఊటీకి వెళ్లాడని సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అయితే నిందితుడు అక్కడా లేడని తెలుస్తోంది.


జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ఘటనపై రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు ఆదేశాలు జారీచేశారు. అటు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు సైతం ఈ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ సుదర్శన్‌ను నియమించింది ప్రభుత్వం. బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ను మరోసారి రికార్డు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Also read: Major Collections: రెండ‌వ రోజు 'మేజ‌ర్' చిత్రం హవా.. మొత్తం ఎంత క‌లెక్ట్ చేసిందంటే?


Also read:Earthquake: అండమాన్ సముద్రంలో భూకంపం, సునామీ హెచ్చరిక..ఏపీలో కూడా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook