రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ మరియు ఈశ్వరీబాయి ట్రస్టు ఆధ్వర్యంలో అందించే తెలంగాణ మేటి మహిళ ఈశ్వరీబాయి స్మారక అవార్డు ఈ సంవత్సరం అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్‌కు బహుకరించారు. తెలంగాణ పంచాయితీ రాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఈశ్వరీబాయి ధీరవనిత. భర్తను కోల్పోయినా మనోధైర్యంతో రాజకీయాల్లో ఆమె తిరుగులేని బావుటా ఎగరువేయడం నిజంగా గొప్ప విషయం. తెలంగాణలో మహిళా సాధికారతను పెంపొందించడం కోసం ఆమె ఎంతగానో ప్రయత్నించారు. 1951లో కౌన్సిలర్‌గా, 1972లో సంపూర్ణ తెలంగాణ సాధన సమితి ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె ఎక్కడా రాజీ పడకుండా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు" అని తెలిపారు.


ఆ అవార్డు ఈ సంవత్సరం డా.బి.ఆర్.అంబేద్కర్ మనుమడు మరియు సామాజిక కార్యకర్త ప్రకాష్ అంబేద్కర్‌కు అందించడం సంతోషదాయకమని కేటీఆర్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనుసరించిన బోధించు, సమీకరించు, సాధించు నినాదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన తెలిపారు. చిన్న రాష్ట్రాల వల్లే దేశ వికాసం సుగమమవుతుందని ఆయన ఎప్పుడో చెప్పారని కేటీఆర్ తెలిపారు.