ప్రణయ్ హత్య కేసు : వరంగల్ సెంట్రల్ జైలుకు నిందితులు
వరంగల్ సెంట్రల్ జైలుకు ప్రణయ్ హత్య కేసు నిందితులు
సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులను పోలీసులు బుధవారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకన్నా ముందుగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏ1 తిరునగరి మారుతీ రావు, ఏ5 ఎండీ అబ్దుల్ కరీం, ఏ6 తిరునగిరి శ్రవణ్ కుమార్‌లపై పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్) కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను నల్గొండ జైలు నుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్టు మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు.
తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కోపంతో కూతురు అమృత వర్షిణి భర్త ప్రణయ్‌ను దారుణంగా నరికి చంపిన కేసులో అమృత తండ్రి మారుతి రావు, బాబాయి శ్రవణ్ కుమార్, వారి స్నేహితుడు ఎండీ కరీం నిందితులుగా ఉండగా... మారుతి రావు ఇచ్చిన సుపారి మేరకు బీహార్ నుంచి వచ్చిన హంతకుల ముఠా ఈ హత్యలో నేరుగా పాల్గొన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైన సంగతి తెలిసిందే. మారుతి రావు పెంచుకున్న పగకు ప్రణయ్ బలి కాగా ప్రణయ్ భార్య అమృత తనకు న్యాయం జరగాలి అంటూ ప్రస్తుతం తన తండ్రిపై న్యాయపోరాటం చేస్తున్నారు.