Rahul Gandhi in TS: టీఆర్ఎస్, బీజేపి.. రెండూ దోస్తులే అనడానికి అదే నిదర్శనం: రాహుల్ గాంధీ
Rahul Gandhi in TS: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో మూడు రోజుల బ్రేక్ అనంతరం ఇవాళ ఉదయం తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇదే ఉత్సాహంతో కాశ్మీర్ చివరి వరకు కొనసాగుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
Rahul Gandhi Speech: దేశంలో హింస, ద్వేషం నానాటికి పెరిగిపోతున్నాయి. హింస, ద్వేషాలకు తావు లేకుండా స్వచ్ఛమైన వాతావరణంలో దేశ నిర్మాణం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే దేశాన్ని చుట్టొస్తూ భారత్ జోడో యాత్ర చేపట్టాను అని రాహుల్ గాంధీ తెలిపారు. అక్కడ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ దుష్ట పాలన సాగిస్తున్నారు. పార్లమెంటులో ఏ బిల్లు ప్రవేశపెట్టినా బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఒక నాణేనికి బొమ్మ, బొరుసు ఎలాగో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా అలాగే. ఆ రెండు పార్టీలు అవసరమైన ప్రతీసారి ఒకదానికొకటి పరస్పరం సహకరించుకుంటూనే జనం ముందు డ్రామాలు చేస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ.. రెండూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి. రైతుల సంక్షేమం కోసం పార్లమెంట్ సాక్షిగా ఎన్నో బిల్లులు తెచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ, టీఆర్ఎస్ రెండూ సమ దూరంలో ఉన్న శత్రువులే అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై..
దేశంలో బీజేపి.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నారని రాహుల్ గాంధీ అసహనం వ్యక్తంచేశారు. కేసీఆర్ సర్కారు అత్యంత అవినీతికి పాల్పడుతోందని చెబుతూ.. దొంగతనం చేసే అవకాశం ఉన్న ప్రతీ చోటా కేసీఆర్ అండ్ కో దోచుకుంటూ పోతోందని ఎద్దేవా చేశారు. 15 వేల కోట్ల రూపాయల విలువైన మియాపూర్ భూముల కుంభకోణంలో తెలంగాణ సర్కారు ఎలాంటి విచారణ చేపట్టలేదు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో భారీ మొత్తంలో అవినీతికి తెరతీశారు అని కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
టీఆర్ఎస్, బీజేపి వ్యాపార సంస్థలు..
రాష్ట్రంలో నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు ఒక రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా వ్యాపార సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసి రాజకీయాలు మాత్రమే చేస్తున్నాయి. దేశంలో చూసినా.. తెలంగాణలో చూసినా.. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతూ తారాస్థాయికి చేరిందన్నారు.
ఈ ప్రశ్నలకు ప్రధాని మోదీ ఏం సమాధానం చెబుతారు..
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల దిగువ, మధ్య తరగతి వారి మీద తీవ్ర ప్రభావం పడింది. అందుకే యవత్ దేశ ప్రజలు ప్రస్తుతం మార్పు కోరుకుంటున్నారు. నిరుద్యోగ సమస్య అంతకంతకూ పెరిగిపోతోంది. నిత్యావసరాల ధరల పెరుగుదలకు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుదలకు ప్రధాని నరేంద్ర మోదీ ఏం సమాధానం చెబుతారని కేంద్రాన్ని ప్రశ్నించారు.
మీ ప్రేమాభిమానాలే నన్ను నడిపిస్తున్నాయి..
తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనలో ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా అలా జనం ఎదుర్కొంటున్న సమస్యలను ఎలుగెత్తి చాటాడానికే తాను భారత్ జోడో యాత్ర చేపట్టానని స్పష్టంచేశారు. తాను అలుపెరగకుండా కన్యాకుమారి నుండి నడుస్తూ వస్తున్నానంటే.. అది మీరు అందిస్తున్న అభిమానం, ఉత్సాహం, ప్రేమతోనే నడుస్తున్నానని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.