Revanth Reddy fire on KTR: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ తప్పించి బీజేపీ, టీఆరెస్ గెలిచినా వచ్చే ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రఘునందన్ రావు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్.. ఈ ఇద్దరూ కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని హామీలు గుప్పించారు. కానీ దుబ్బాక, హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపాటి నిధులు తెచ్చారని ప్రశ్నించారు. ఇది బీజేపీ నేతలు ఓటర్లను నమ్మించి మోసం చేయడం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లకు రేవంత్ రెడ్డి ఛాలెంజ్
బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లు ఉప ఎన్నికల తర్వాత మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపండి అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం నుండి మీరు తెచ్చిన నిధుల లెక్క ఏంటో చెప్పండని నిలదీశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయినా హుజూర్ నగర్, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగలేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని ఎద్దేవా చేశారు.


బంగారు తెలంగాణలో మునుగోడు లేదా ?
తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కారు.. మునుగోడు నియోజకవర్గాన్ని, నియోజకవర్గంలో అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదన్నారు రేవంత్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గం బంగారుమయం కాలేదు.. గుంతల రోడ్ల మునుగోడుగా మార్చేసిర్రు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే.. మునుగోడు నియోజకవర్గాన్ని తానే స్వయంగా దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని అంటున్నారు కానీ బంగారు తెలంగాణలో మునుగోడు నియోజకవర్గం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దత్తత పేరుతో మంత్రి కేటీఆర్ మరోసారి కొత్త డ్రామాలు ఆడుతున్నాడని విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది మొత్తం రాష్ట్రం అభివృద్ధి చేయడానికి కాదా అని నిలదీశారు?


మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవాలంటే..
మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధిని ప్రశిస్తున్న జనాన్ని బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బెదిరిస్తున్నాడు. ఓటు అడుక్కోవడానికి వచ్చిన నవ్వు ఓటర్లపైనే దౌర్జన్యం చేస్తావా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే.. టీఆరెస్, బీజేపీ పార్టీలు భయంతో గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాయి. లేదంటే ఇక అభివృద్ధి శూన్యమే అని అన్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఒక చారిత్రక అవసరంగా చెబుతున్నా అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.