హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మూఢ నమ్మకాలను బలవంతంగా ప్రజానికంపై రుద్దుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. సచివాలయం, అసెంబ్లీ కూల్చివేత వ్యవహారంపై నేడు అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సచివాలయంలో నిర్మించిన ఏ భవనమైనా 30-35 ఏళ్ల లోపువేనని, ప్రభుత్వ భవనాలన్నింటినీ సివిల్ ఇంజనీర్స్ రాబోయే 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని నిర్మించడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర పరిపాలన పరంగా అవసరాలకు మించిన భవనాలు సచివాలయంలో ఉన్నాయని, అటువంటప్పుడు పాతవి కూల్చి, కొత్తవి కట్టాల్సిన అవసరం ఏముందని తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించారు. అంతేకాకుండా సచివాలయంలోని పోచమ్మ గుడి, మసీద్‌లను ఎలా కూలుస్తారు అని రేవంత్ రెడ్డి సర్కార్‌ను నిలదీశారు. కోర్టులు ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటే అది బాధ్యతల నుంచి తప్పుకోవడమేనని అవుతుందని అన్నారు. సచివాలయం, అసెంబ్లీ కూల్చివేత విషయంలో అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకోవచ్చని రేవంత్ అభిప్రాయపడ్డారు.


గవర్నర్ జోక్యం చేసుకోవాలి:
రాష్ట్రంలో వున్న ప్రభుత్వ ఆస్తులను రక్షించే బాధ్యత రాష్ట్ర గవర్నర్‌దేనని గుర్తుచేసిన రేవంత్ రెడ్డి... ఒకవేళ గవర్నర్ స్పందించనట్టయితే రాజ్‌భవన్‌ను ముట్టడించి నిరసన వ్యక్తంచేద్దామని అన్నారు. ఆ తర్వాత కూడా గవర్నర్‌ స్పందించకపోతే, గవర్నర్‌ని కూడా బాధ్యున్ని చేసి కోర్టులో పిటిషన్ వేస్తానని హెచ్చరించారు.