Revanth Reddy: మామా, అల్లుళ్లే హంతకులు.. ఇబ్రహీంపట్నం ఘటనపై కేసీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి ఫైర్..
Revanth Reddy on Ibrahimpatnam Incident: ఇబ్రహీంపట్నం ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మామా, అల్లుళ్లే హంతకులని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులను ఉద్దేశించి ఆరోపించారు.
Revanth Reddy on Ibrahimpatnam Incident: ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అవి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. మామా అల్లుళ్లు కేసీఆర్, హరీశ్ రావు మహిళా హంతకులని ఆరోపించారు. మృతుల కుటుంబాలను మంత్రి హరీశ్ రావు ఎందుకు పరామర్శించట్లేదని ప్రశ్నించారు. మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో బుధవారం (ఆగస్టు 31) వినాయక చవితి పూజల అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇబ్రహీంపట్నం ఘటనలో ప్రభుత్వం కేవలం ఒక అధికారిని సస్పెండ్ చేసి తూతూ మంత్రంగా చర్యలు తీసుకుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రతీ ఒక్కరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇకనైనా మంత్రి హరీశ్ రావు చనిపోయిన మహిళల కుటుంబాలను పరామర్శించాలని.. వారికి రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుందన్నారు.
కాగా, ఇటీవల ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మమత (25), సుష్మా (26), మేరావత్ మౌనిక (25), అవుతపురం లావణ్య (25) అనే నలుగురు మహిళలు మృతి చెందారు. ప్రస్తుతం మరికొందరు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మునుగోడులో ప్రచారంపై రేవంత్ :
ఇక మునుగోడు ఉపఎన్నిక గురించి ప్రస్తావిస్తూ.. గురువారం (సెప్టెంబర్ 1) నుంచి అక్కడ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. ఒక్కో మండల ఇన్‌ఛార్జి మూడు గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్ 6వ తేదీ వరకు తొలి విడత ఇంటింటికి ప్రచారం కార్యక్రమం ఉంటుందన్నారు. ఇంటింటికి ప్రచారం ద్వారా ప్రతీ ఇంటికి వెళ్లి ఓట్లు అడుగుతామని.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌ని జనాల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. సెప్టెంబర్ 3న మునుగోడులో ప్రెస్ మీట్ నిర్వహిస్తామని చెప్పారు. అందులో తనతో పాటు పార్టీ ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మధుయాష్కీ తదితరులు పాల్గొంటారని చెప్పారు.
Also Read: నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా.. ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటా: మహేష్ బాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook