Revanth Reddy Speech From Jadcherla Meeting: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా గురువారం జడ్చర్లలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో అభివృద్ధి నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు వెళుతున్నాయి అని ఆయన ఆరోపించారు. 2009లో కరీంనగర్ ప్రజలు బొంద పెడ్తరని భయపడి కేసీఆర్ పాలమూరుకు వస్తే ఇక్కడి ప్రజలు గెలిపించి ఆయనకు రాజకీయ భిక్ష పెట్టారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినప్పటికీ...
కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ పూర్తయ్యాయి కానీ వాటి కంటే ముందు మొదలు పెట్టిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2010లో అలంపూర్ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు బంజారాహిల్స్ లోని తన ఇళ్లు అమ్మి అయినా వరద బాధితులకు ఇళ్లు కట్టిస్తా అని మాట ఇచ్చిండు. ఒక్క ఇళ్లు కట్టి ఇయ్యలేదు అని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించారు. 
“పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరు అడ్డుకున్నారని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నా. కేసీఆర్ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా పాలమూరు ప్రజల రుణం తీర్చుకోలేరు. పాలమూరులో 10 లక్షల ఎకరాలను ఎడారి చేసే హక్కు కేసీఆర్ ఎవరు ఇచ్చారు? తులసి వనంలో గంజాయి మొక్కలా... పాలమూరు అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకుంటున్నారు” అని రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.


ఆ మహానుభావులంతా మన పాలమూరు బిడ్డలే..
2000లో చిన్నారెడ్డి నేతృత్వంలో 42 మంది శాసనసభ సభ్యులు సోనియా గాంధీకి తెలంగాణ కావాలని వినతి పత్రం ఇచ్చారు. అప్పుడు వనపర్తిలో సభ నిర్వహిస్తే 10 వేల మంది కూడా రారు అనుకుంటే 50 వేల మందికి పైగా వచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, సూదిని జైపాల్ రెడ్డి, మహేంద్రనాథ్, మల్లు అనంతరాములు, మల్లికార్జున గౌడ్ వంటి మహామహులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. వాళ్లంతా మన పాలమూరు బిడ్డలే అని ఆయన వ్యాఖ్యానించారు. 


బడుగు బలహీనవర్గాల బిడ్డలు కులవృత్తులు చేసుకోని బతకాలా ?
వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకొని బడుగు బలహీనవర్గాల బిడ్డలు కులవృత్తులు చేసుకోని బతకాలి అని అంటుండు. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జడ్చర్ల ప్రాతినిధ్యం వహించిన లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కూడా ఈ ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రి తేలేకపోయారు. కనీసం ఆస్పత్రిలో కరెంట్ పోతే పెట్టుకునేందుకు జనరేటర్ కూడా లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎర్ర శేఖర్, మల్లు రవి ఉన్నప్పుడే జడ్చర్ల  అభివృద్ధి జరిగిందని, సెజ్ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చిందన్నారు. జడ్చర్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు రేవంత్ రెడ్డి. 


నేను నల్లమలలో పుట్టిన మీ పాలమూరు బిడ్డను..
“తాను ఇప్పటికే సవాల్ విసిరా... మరోసారి ఇక్కడ లక్ష్మారెడ్డికి సవాల్ విసురుతున్నా.. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో అక్కడే ఓట్లు అడగండి.. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతాం. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూద్దాం” దీనికి సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.  “నేను మీరు నాటిన మొక్కను. 2006లో మిడ్జిల్ నుంచి జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తే నన్ను గెలిపించారు. ఆ రోజు మీరు నాటిన మొక్క ఇవాళ మహా వృక్షమైంది. టీపీసీసీ అధ్యక్షుడుగా మీ ముందు నిలబడ్డా.. ఇది మిడ్జిల్ ప్రజల గొప్పదనం.. నల్లమల అడవుల్లో పుట్టిన మీ బిడ్డకు టీపీసీసీ అధ్యక్షుడుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యతను సోనియా గాంధీ అప్పగించారు. కాబట్టి మీ బిడ్డను ఆదరించండి. జిల్లాలో 14కు 14 అసెంబ్లీ స్థానాలను, 2 పార్లమెంటు స్థానాలను గెలిపించండి. అలా చేస్తేనే సోనియమ్మకు కృతజ్ఞత చెల్లించిన వాళ్లం అవుతాం. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించి అంశం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 


రేవంత్ రెడ్డి హామీల వర్షం..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల, తుమ్మిళ్ల ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. బోయలను ఎస్టీల్లో చేరుస్తామన్నారు. " కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు అందిస్తాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ అందిస్తాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. రూ. 500 లకే పేదలకు గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఉచిత సిలిండర్ ఇస్తామని ఆడబిడ్డలని మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తుండు.. ఉచిత సిలిండర్ కాదు.. కేసీఆర్ కిడ్నీలు అమ్మి ఇస్తానని చెప్పినా తెలంగాణ సమాజం నమ్మదు " అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.