Raithu Bharosa:దసరాకు ముందే రైతు భరోసా..? సాయంలో రైతులకు బంపర్ ఫిట్టింగ్ పెట్టిన రేవంత్..
Raithu Bharosa: దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. ఈ సారి ఎకరాకు 7వేల 500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయనున్నారట.
Raithu Bharosa: రైతు భరోసా కింద వచ్చే నెలలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు. ఆ వెంటనే విడతలవారీగా వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని పలు వేదికల మీద మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడా చెబుతూ వస్తున్నారు.
ఈ క్రమంలో రైతు బంధు స్కీమ్ లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించింది. పంటలు పండని రాళ్లు, రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు, భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృథాగా చెల్లించినట్టు తేల్చింది. దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధి విధానాల ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేసి.. రైతులు, రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు తగ్గట్టుగా రైతుభరోసాకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 5 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. దీంతో ప్రతి సీజన్ కు సగటున సర్కారుపై 7వేల 600 కోట్ల భారం పడేది. నిజానికి చిన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను తీసుకొచ్చారు. పెద్ద రైతులకే ఎక్కువ లబ్ధి జరుగుతున్నదనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సారి పెట్టుబడి సాయానికి సీలింగ్ పెట్టాలని నిర్ణయించింది. రైతు భరోసా కొత్త మార్గదర్శకాలతో పాటే ఎన్ని ఎకరాలకు ఇస్తారనే క్లారిటీ ఇవ్వనుంది.
బడ్జెట్లో మాత్రం ఎప్పటిలాగే రైతుభరోసా కోసం ప్రభుత్వం దాదాపు రూ. 15 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్‌లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.ఇందులో వరి, పత్తి పంటలదే అగ్ర భాగంగా ఉంది. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేశారో ఏఈఓలు ట్యాబ్‌లలో నమోదు చేశారు. దాని ప్రకారమే పంట కొనుగోళ్లు కూడా చేపట్టనున్నారు. ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైన భూములకు ఎకరాకు 7వేల 500 చొప్పున రైతు భరోసా ఇస్తే దాదాపు 10 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా ఏడున్నర ఎకరాలలోపే పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కేబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రపోజల్స్‌పై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించాక ఫైనల్ చేయనున్నారు. ఈ సారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. నాన్‌అగ్రికల్చర్ భూములను ధరణి సాగు పట్టా భూముల లిస్ట్ నుంచి తీసేస్తున్నది.
ఇలా కనీసం 20 లక్షల ఎకరాలు తీసే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో దాదాపు రూ. 1వేయి 500 కోట్ల రూపాయల దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఇక రైతు బంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్ వరకు దాదాపు రూ. 73 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందించారు. సాగులో లేని రాళ్లు రప్పలు, గుట్టలకు, వెంచర్లకు, ఇండ్లకు, హైవేలకు, రోడ్లకు ఇతరత్రా వాటికి ఏకంగా రూ. 25 వేల కోట్లు చెల్లించినట్టు ప్రభుత్వం గుర్తించింది. అంటే ఏడాదికి యావరేజ్‌గా రెండు సీజన్లలో కలిపి రూ. 3 వేల కోట్ల మేర దుబారా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.