రాహుల్ సమక్షంలో అక్టోబర్ 31న రేవంత్ కాంగ్రెస్లో చేరిక
టీడీపీ మాజీ నేత రేవంత్‌రెడ్డి చేరికను కాంగ్రెస్ పార్టీ నేతలంతా స్వాగతించాల్సిందేనని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్.సి. కుంతియా స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో గోల్కొండ హోటల్ లో వేరువేరుగా మాట్లాడారు. రేవంత్ చేరికపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే కుంతియా హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 31న దిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యకుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్‌రెడ్డి చేరిక ఉంటుందని కుంతియా మీడియాకు తెలిపారు. రేవంత్ రాకను రాష్ట్ర నాయకులెవరూ వ్యతిరేకించడం లేదు. రేవంత్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఆహ్వానిస్తామని, నాయకుల పనితీరును బట్టి పదవులు, ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో నవంబర్ నెలలో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉంటుందని అన్నారు.
పెద్దమ్మతల్లి.. నీవే అండ
సోమవారం ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. అనంతరం తన ఇంటికి వచ్చిన అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.