దొంగగా భావించి.. తెలంగాణలో రష్యన్ యాత్రికుడిపై దాడి..!
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బిక్నూర్ ప్రాంతంలో ఈ రోజు ఓ సంఘటన చోటు చేసుకుంది.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బిక్నూర్ ప్రాంతంలో ఈ రోజు ఓ సంఘటన చోటు చేసుకుంది. ప్రపంచ సైకిల్ యాత్రలో భాగంగా వివిధ దేశాలను సైకిల్ మీద సందర్శిస్తున్న రష్యన్ యాత్రికుడు అలెక్స్ ఓల్గెని దొంగగా పొరబడి చితకబాదారు స్థానికులు. వివరాలలోకి వెళితే.. ఇప్పటి వరకూ 30 దేశాలు సంచరించిన అలెక్స్ ఈ మధ్యనే భారత్ చేరుకున్నారు. ఈ క్రమంలో సైకిల్ పై షిర్డీ వెళ్లాలని భావించారు.
ఆయన హైదరాబాద్ దాటి.. కామారెడ్డి మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో భారీగా వర్షం పడింది. అలెక్స్ తల దాచుకోవడం కోసం స్థానికంగా ఉన్న పొలానికి దగ్గరలో తన టెంట్ పాతి.. చలిమంట వేసుకుంటుండగా.. గ్రామస్తులు వచ్చి ప్రశ్నించారు. వారి భాష అర్థం కాకపోవడంతో అలెక్స్ తడబడ్డాడు. దీంతో అతన్ని దొంగగా అనుమానించి స్థానికులు కొట్టారు. ఆ తర్వాత గ్రామపెద్దలు వచ్చి సర్దిచెప్పి.. అతన్ని పోలీస్ స్టేషనుకు అప్పగించారు.
పోలీస్ విచారణలో అలెక్స్ రష్యన్ యాత్రికుడని.. ఆయన సైకిల్ పై దేశాలు సంచరిస్తున్నారనే విషయం బహిర్గతమైంది. అయితే అప్పటికే గ్రామస్తులు కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అలెక్స్‌ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి.. ట్రీట్‌మెంట్ చేయించారు.