ఆపరేషన్ చేశారు... కడుపులో కత్తెర మరిచారు!
యువతికి 2 నెలల క్రితం శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ఆమె కడుపులో కత్తెరను మర్చిపోయారు.
నల్లగొండ: శస్త్ర చికిత్సలు చేసి కడుపులో కత్తెరలు, సెల్ ఫోన్స్ మరిచిపోయే దృశ్యాలు కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే, హైదరాబాద్ కొత్తపేటకు చెందిన ఓ ఆస్పత్రి వైద్యులు ఆ దృశ్యాన్ని నిజంగానే చేసి చూపించి తమ నిర్లక్ష్య వైఖరిని చాటుకున్నారు. నల్గొండ జిల్లా బచ్చన్నగూడెం గ్రామానికి చెందిన దోటి జ్యోతి (28) అనే యువతికి 2 నెలల క్రితం శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ఆమె కడుపులో కత్తెరను మర్చిపోయారు. గురువారం భరించలేని కడుపు నొప్పితో బాధపడుతున్న జ్యోతిని ఆమె కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా స్కానింగ్ ఈ నిజం బయటపడింది. బాధితురాలి కడుపులో దాదాపు 10 అంగుళాల కత్తెర ఉన్నట్లు తెలిసింది.
2 నెలల క్రితం సర్జరీ చేసినప్పటి నుంచి ఆమె కడుపు నొప్పితో బాధపడుతోందని.. అయితే, వైద్యులు ఇలా కడుపులో కత్తెరను మర్చిపోవడం వల్లేనని తమకు తెలీదని జ్యోతి కుటుంబసభ్యులు, బంధువులు వాపోయారు.