ఆర్టీసీ డిపోల వద్ద 144 సెక్షన్ అమలు !!
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సెరైన్ మ్రోగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది
ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికుల సమ్మె కొనసాగించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. అవసరమైతే పోలీస్ బందోబస్తు మధ్య సర్వీసులను నడపాలని నిర్ణయించింది.
రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం తక్షణ అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రతీ డిపోకి ఒక పోలీస్ అధికారిని ఏర్పాటు చేస్తామన్న డీజీపీ... ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు హెచ్చరించారు.
టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో ఐఏఎస్ ల కమిటీ ఈరోజు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల డిమాండ్లకు ఐఏఎస్ ల కమిటీ అంగీకరించలేదని.. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పోలీసుల సాయంతో ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది.