Shabbir Ali About KCR Contesting in Kamareddy: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. రింగ్ రోడ్ల పేరుతో తెలంగాణలో పేదల భూములన్నీ లాక్కుంటున్న కేసీఆర్.. చివరకు ఆ భూములను కేసీఆర్ బంధువుల పేరిట మార్పిడి చేసుకుంటున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఇక్కడి నుంచి తరిమి కొడతామని అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. " ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడానికి సిద్ధపడుతున్న కామారెడ్డి నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ తో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అమ్ముకున్న కేసీఆర్.. ఇప్పుడు కామారెడ్డి జిల్లా కేంద్రం చుట్టు పక్కల ఉన్న భూములను అమ్ముకునేందుకు వస్తున్నారు అని మండిపడ్డారు. నాసిరకం డబుల్ బెడ్ రూంలు నిర్మించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అని ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై విచారణ జరిపించి ఆమెను జైలుకు పంపే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని అన్నారు. 


కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది అని ఆరోపించిన షబ్బీర్ అలీ... తండ్రి కేసీఆర్ లిక్కర్ షాపులు పెడితే, కూతురు కవిత ఆ లిక్కర్ దందాకి రాణి అయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రోళ్లు పెప్పర్ స్ప్రే కొట్టినా వెనుకకు రాకుండా తెలంగాణ బిల్ పాస్ చేసిన ధైర్యశీలి సోనియా గాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్ము ప్రజలకు పంచుతామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. 


బిఅర్ఎస్ పార్టీ హయాంలో విద్యా రంగం, వైద్యం .. రెండూ మూలనపడ్డాయని, బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఅర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసి కేసీఆర్‌ని బొందపెడతామన్నారు. తాను కామారెడ్డి గడ్డ మీద పుట్టానని, ఇక్కడే చస్తానని, ఒక్కసారి తనను ఆశీర్వదించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్టుగా గజ్వెల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసినట్టయితే.. అక్కడ కేసీఆర్ కి పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీనే కానున్నారు అనే విషయం తెలిసిందే.