కేజ్రీవాల్ కోసం ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురు తిరిగిన బీజేపీ ఎంపీ శత్రుఘన్ సిన్హా
ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వెళ్తున్న బీజేపీ ఎంపీ శత్రుఘన్ సిన్హా
వీలు చిక్కినప్పుడల్లా సొంత పార్టీపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతూ కేంద్ర సర్కార్‌పై తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్న బీజేపీ ఎంపీ, సినీనటుడు శత్రుఘన్ సిన్హా మరోసారి ప్రధాని మోదీపై అంతే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడాన్ని ప్రస్తావిస్తూ శత్రుఘన్ సిన్హా రెండు ట్వీట్స్ చేశారు. అందులో మొదటి ట్వీట్‌లో డైనమిక్ లీడర్ అరవింద్ కేజ్రీవాల్ కోరుతున్న విధంగా ఇకనైనా ఐఏఎస్ అధికారులు తమ నిరసన విరమించుకుని విధుల్లో చేరుతారని ఆశిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే, ఇందులో అరవింద్ కేజ్రీవాల్‌ని గొప్ప నాయకుడిగా అభివర్ణించిన శత్రుఘన్ సిన్హా.. అతడు చేస్తున్నదాంట్లో తప్పులేదని అన్నారు.
ఇక ఇదే విషయమై రెండో ట్వీట్ చేసిన శత్రుఘన్ సిన్హా.. 'బహుశా ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యవహారంలో కలుగచేసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి ధర్నా విరమింపచేస్తారని ఆశిస్తున్నా' అని అభిప్రాయపడ్డారు. '' ఢిల్లీ ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమైనా మోదీ ఈ పనిచేస్తారని అనుకుంటున్నా. వేయి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుద్ది. జై హింద్'' అని శత్రుఘన్ సిన్హా తన రెండో ట్వీట్‌లో పేర్కొన్నారు.