ఆంధ్ర, తెలంగాణ ఆస్తుల పంపకాలపై ఉన్నతస్థాయి కమిటీ భేటీ..!
ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల ఆస్తుల పంపకాల విషయం ఆసక్తికరంగా మారుతోంది
ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల ఆస్తుల పంపకాల విషయం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే విభజన చట్టం ప్రకారం 9,10 షెడ్యూళ్ల ఆధారంగా సంస్థల విభజన జరగాలని ఇరు రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. అందుకోసమే షీలా బిడే కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ మొదటి రోజు భేటీలో అటూ ఇటూ తెగని పలు విషయాలకు పరిష్కారాలు ఆలోచించగా.. రెండు రోజు భేటీలో సమస్యలను ఒక కొలక్కి తెచ్చే దిశగా మంతనాలు సాగించారు.
ఇప్పటికే రాష్ట్రాల విభజన జరిగి నాలుగేళ్లు అయిపోయింది. అయినా పనులన్నీ అరకొరగా జరగడం, పంపకాల విషయంలో జాప్యం జరగడం లాంటి కారణాలు తలెత్తడంతో ఎటు వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఏదీ సవ్యంగా జరగలేదు. ఈ క్రమంలో ఈ ప్రభుత్వ సంస్థల విభజన అంశం అనేది ఎట్టిపరిస్థితిలోనైనా సాధ్యమైనంత వేగంగా జరిగి తీరాలని కమిటీ తెలిపింది.
ఇప్పటికే షెడ్యూల్ 9,10 ప్రకారం 91 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా.. దాదాపు 78 సంస్థలు విభజన ప్రక్రియను ముగించుకున్నాయి. ఇంకా 13 సంస్థల భవితవ్యం తేలాల్సి ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ ప్రాంతంలోని పరిశ్రమల భవన్‌లో కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులు, సంస్థల ఎండీలు హాజరయ్యారు.