మేడ్చల్ సభలో సోనియా ఉద్వేగ ప్రసంగం; తెలంగాణ ప్రజల సమస్యలు చూసి తల్లిలా బాధపడుతున్నా
మేడ్చల్ ఎన్నికల సభలో సోనియా గాంధీ ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ .. కేసీఆర్ పాలన వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. రాబోయే తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుందో కూడా వివరించారు. చాలా కాలం తర్వాత పిలల్ని కలిసిన తల్లి ఏ విధంగా సంతోషపడుతుందో తెలంగాణ ప్రజలను చూసిన తాను అంతకంటే ఎక్కవగా సంతోషం పడుతున్నానని ఉద్వేగంగా ప్రసంగించారు.
సోనియా మాట్లాడుతూ ఈ నాలుగేళ్లలో తెలంగాణలో ఎలాంటి పాలన సాగిందో తెలంగాణ ప్రజలకు అర్థమై ఉంటుంది. తెలంగాణ ప్రజల కలలు నీరుగారిపోయాయి...నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారు. తీరా తెలంగాణ వచ్చిన తర్వాత అవేవి సాధ్యం కాకపోగా ప్రజలకు కష్టాలే మిగిలాయని పేర్కొన్నారు. ఈ రాష్టంలో రైతులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. భూసేకరణ చట్టాన్ని కూడా తుంగలోకి తొక్కారని సోనియా విమర్శించారు.
సోనియా స్పీచ్ కంటే ముందుకు పలువురు టి.కాంగ్రెస్ నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనపై విరుచుపడ్డారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలకు టీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ కుటుంబ పాలను తెలంగాణ ప్రజలను చమరగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని నేతలు పేర్కొన్నారు.
కాగా సోనియా సభ సందర్భంగా భారీ ఎత్తున జనసమీకరణ చేశారు. కాగా ఈ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ తోపాటు మహాకూటమిలోని ఇతర పార్టీల నేతలు టీటీడీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్ తదితరులు పాల్గొన్నారు. సోనియా సభలో వేదికపై కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, షబ్బీల్ అలీ, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు, విజయశాంతి, బీసీ నేత ఆర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు సాయంత్రం 5 గంటలకు బేగంపేట చేరుకున్న సోనియా, రాహుల్ ను టి.కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి,షబ్బీర్ అలీ తదితరులు ఘన స్వాగతం పలికారు. కాగా బేంగపేట నియోజకవర్గం నుంచి నేరుగా సోనియా, రాహుల్ మేడ్చల్ బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు.