ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ఘుమఘుమలు
ప్రపంచ తెలుగు మహాసభలకు ఆతిథ్యం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, రాష్ట్ర సంప్రదాయ వంటకాలను, హైదరాబాద్ నగర ఆహార సంస్కృతిని రుచి చూపే పదార్థాలను వండి వార్చి వడ్డించింది.
ప్రపంచ తెలుగు మహాసభలకు ఆతిథ్యం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం.. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, రాష్ట్ర సంప్రదాయ వంటకాలను, హైదరాబాద్ నగర ఆహార సంస్కృతిని రుచి చూపే పదార్థాలను వండి వార్చి వడ్డించింది. అయిదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి భోజన ఏర్పాట్లను పౌర సంబంధాల శాఖ పర్యవేక్షిస్తోంది. మరి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న అతిరథ మహారథులతో పాటు భాషాభిమానులు ఎలాంటి వంటకాలు రుచి చూశారో మనమూ తెలుసుకుందాం..!
పెసర వడియాల పులుసు - పెసరపప్పును బాగా నానబెట్టి అల్లం, పచ్చిమిర్చితో తయారుచేసిన ఈ పులుసు అచ్చ తెలుగు వంటకమే.
వంకాయ బగారా - హైదరాబాదీలకు, తెలంగాణ వారికి ఈ వంటకం ప్రత్యేకం. వంకాయలను తరిగి నూనెలో బాగా వేయించాక.. పల్లీలూ, తెల్లనువ్వులూ, కొబ్బరి తురుమూ, చింతపండు గుజ్జూ, ధనియాలపొడీ, అల్లంవెల్లుల్లీ, ఉల్లిపాయలూ కలిపిన మసాలాను అందులో కూరి మళ్లీ దోరగా వేయించడం ఈ కూర ప్రత్యేకత.
గాజర్ కా హల్వా - ఉడికించిన క్యారెట్‌తో చేసే హల్వా ఇది. ఉత్తరాది వంటకమైనా.. ఇది కూడా హైదరాబాదీ ముస్లిములకు స్పెషలే.
పుంటికూర పప్పు - తెలంగాణలో గోంగూర కాయలు, పప్పుతో చేసే వంటకం ఇది.
మక్క గారెలు - మొక్కజొన్న కంకుల నుంచి గింజలను వేరుచేసి ఉప్పు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లితో తయారుచేసే తెలంగాణ వంటకం ఇది.
సర్వపిండి - సర్వపిండిని 'తెలంగాణ పాన్ కేక్' అని కూడా ముద్దుగా అంటారు. అలాగే గిన్నె రొట్టె అని కూడా పిలుస్తారు. నువ్వులు, పల్లీలు, సెనగపప్పు వేయించి తయారుచేసే ఈ వంటకాన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమిర, కారంపొడి, అల్లం వెల్లుల్లి ముద్దతో కలిపి తయారుచేస్తారు.
కుర్బానీ కా మీఠా - పక్కా హైదరాబాదీ తీపి వంటకం ఇది. జల్దారు పండ్లతో తయారుచేసే ఈ వంటకం తెలంగాణలో చాలా ప్రత్యేకం.
బగారా అన్నం - ఇది కూడా హైదరాబాదీ వంటకమే. ఒక రకంగా చెప్పాలంటే కాయగూరలు లేని సాధారణ బిర్యానీ అన్నం ఇది.
వీటితో పాటు పలు ఆంధ్రా వంటకాలను కూడా మహాసభల్లో వడ్డించనున్నారు.
ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రతీ రోజు వడ్డించే భోజనం మోనూ ఇదే
మొదటి రోజు - తెల్ల అన్నం, కాయగూరల బిర్యానీ, వంకాయ బగారా, దొండకాయ పచ్చడి, టమాటా పచ్చడి, పట్టు వడియాల పులుసు, పాలకూర పప్పు బెండకాయ వేపుడు, చింతకాయ- పండుమిర్చి చట్నీ, పచ్చి పులుసు, పులిహోర, గాజర్ కా హల్వా, డ్రైఫ్రూట్ సలాడ్లు
రెండో రోజు: జీరా అన్నం, వంకాయ సోగి, బీరకాయ, టమాటలతో సోయాకూర, మెంతుల పులుసు, పుంటికూర, దోసకాయ పచ్చడి, పచ్చిమిర్చి తొక్కు, పెసర గారెలు, బూందీ లడ్డూ, ఖద్దు కా హల్వా, చపాతీ, ఆలూ మట్టర్.
మూడవ రోజు: బగార అన్నం, క్యాప్సికం కూర, సొరకాయ పొడి, పప్పుల వేపుడు, గంగవాయిలి-మామిడికాయ పప్పు, టమాటా పచ్చడి, బీరకాయ పచ్చడి, మజ్జిగ రసం, మక్కగారెలు, కుర్బానికా మీటా, ఐస్‌క్రీం, జొన్న రొట్టెలు.
నాలుగోరోజు: టమాటా అన్నం, చిక్కుడు కాయ కూర, వంకాయ పులుసు, కంద వేపుడు, టమాటా పప్పు, వంకాయ పచ్చడి, పుంటికూర పచ్చడి, దల్చా అరటికాయ బజ్జీ, డబుల్ కా మీటా, బెల్లం జిలేబీతో పాటు నార్త్ ఇండియన్ స్పెషల్ ఆలూ పాలక్.
వీటితో రోజూ అన్నం, పండ్లు, పిండి వంటలు.. సకినాలు, సర్వపిండి, చల్ల మిరపకాయలు, పాపడ్స్, మూడు రకాల నెయ్యి పొడులు, మూడు రకాల పచ్చడులు, చట్నీలు, పప్పుచారు, కట్ మిర్చి, పెరుగు, మిఠాయి పాన్ అతిథుల భోజన మెనూలో ఉండనున్నాయి.