Suspended Jagtial Rural SI Anil Kumar: బస్సులో సీటు విషయమై ముస్లిం మహిళతో వివాదం నేపథ్యంలో సస్పెండ్ అయిన జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు తనపై వచ్చిన ఆరోపణలలో స్వార్థపూరితంగా వాడుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటితో తనకు ఎటువంటి సంబంధం లేదని అనిల్ కుమార్ తేల్చి చెప్పారు. ఒక పార్టీ తలపెట్టిన జగిత్యాల పట్టణ బంద్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని అనిల్ కుమార్ స్పష్టంచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనను సస్పెండ్ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ శనివారం జగిత్యాలలో విశ్వ హిందూ పరిషత్ ( వీహెచ్పీ) అలాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బంద్ కి పిలుపునివ్వడంపై స్పందిస్తూ అనిల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాకు ఒక వీడియో విడుదల చేసిన అనిల్ కుమార్.. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణల రీత్యా క్రమశిక్షణ చర్యల మీద పోలీసు శాఖ నియమ నిబంధల ప్రకారం చట్టపరంగా పరిష్కరించుకుంటానని అన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు, ఒక వర్గానికి చెందిన ప్రజలు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. కేవలం వారి స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసమే తన సస్పెన్షన్ ఘటనను వాడుకుంటున్నారని అనిల్ కుమార్ ఆరోపించారు. 


తన పేరిట శనివారం రోజున బంద్ కు పిలుపునిచ్చినట్లు మీడియా కథనాల ద్వారానే తనకు తెలిసిందన్న అనిల్ కుమార్.. ఆ బంద్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో పని చేస్తున్న తాను ఎటువంటి కల్మషాలు లేకుండా శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేశానని అన్నారు. విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించానని తెలిపారు. ఇకపై కూడా అలాగే వ్యవహరిస్తానని అభిప్రాయపడిన అనిల్ కుమార్.. తనకు చట్టంపై, అలాగే అధికారులపై విశ్వాసం ఉందని అన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి అధికారులు విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తారని భావిస్తున్నానని తెలిపారు. ఈలోపే పట్టణంలో బంద్ పాటించి ప్రజలకు విఘాతం కలిగించే పనులు చేయవద్దని అనిల్ కుమార్ ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు.