మహిళా సంఘాలకు రూ.10 లక్షల రుణం ; వడ్డీ భారం ప్రభుత్వానిదే..
మహిళా సంఘాలకు రూ.10 లక్షల రుణం..వడ్డీ భారం ప్రభుత్వానిదే .. ఇది ప్రభుత్వ ప్రకటన అనుకోకండి..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ మేరకు ఆర్ధిక సాయం అందిస్తామని తెలంగాణ పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ప్రతి మహిళా సంఘానికి ఈ మేరకు రుణం అందిస్తామని చెప్పిన ఉత్తమ్ ..వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఇంతటితో ఆగక.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు రూ.2వేలు... దివ్యాంగులకు రూ.3 వేల చొప్పున పింఛన్ ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
షాపూర్‌నగర్‌లో నిర్వహించిన ‘కాంగ్రెస్ మహిళా గర్జన’ సభలో టి.పీసీసీ చీఫ్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల బతుకులు బాగుపడితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ..దీన్ని కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతోందన్నారు. అచ్ఛే దిన్ పేరుతో అధికారంలోకి వచ్చిన మోడీ.. పేదలు, మహిళల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. మోడీ పాలనలో వంటగ్యాస్ రూ.970కి చేరింది..అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటుతున్నాయని విమర్శించారు. డిసెంబర్ 12న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్... అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి అనేక వరాలు కురిపించారు.
కాంగ్రెస్ పార్టీ వరాలు ఇవే:
* తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబంలో ప్రతి మనిషికి నెలకు 7 కిలోల సన్నబియ్యం
* సన్న బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, చక్కెర సహా 9 రకాల వస్తువులు
* మహిళా సంఘాలకు రూ.10 లక్షల రుణం..వడ్డీ భారం ప్రభుత్వానిదే
* వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు రూ.2వేలు
* దివ్యాంగులకు రూ.3 వేల చొప్పున పింఛన్
* ఏడాదికి 6 వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రకటన