Munugode Bypoll: త్వరగా పెడదామా.. ఆలస్యం చేద్దామా! మునుగోడు ఉప ఎన్నికపై కమలం పార్టీలో కన్ఫ్యూజన్..
Munugode Bypoll: తెలంగాణలో అన్ని పార్టీలకు సవాల్ గా మారింది మునుగోడు ఉప ఎన్నిక. షెడ్యూల్ రాకముందే నియోజకవర్గంలో రాజకీయం పీక్ స్టేజీకి చేరింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో మరో అనుమానం కూడా నెలకొంది.
Munugode Bypoll: తెలంగాణలో అన్ని పార్టీలకు సవాల్ గా మారింది మునుగోడు ఉప ఎన్నిక. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తూ ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే నియోజకవర్గంలో రాజకీయం పీక్ స్టేజీకి చేరింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో మరో అనుమానం కూడా నెలకొంది. అసలు ఉప ఎన్నిక వస్తుందా లేక కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి నేరుగా ముందస్తు ఎన్నికలకు వెళతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీలోనూ మునుగోడు విషయంలో కన్ప్యూజన్ ఉందని తెలుస్తోంది. ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అయినా కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లోనే పని చేస్తుందన్నది జగమెరిగిన సత్యం.దీంతో బీజేపీ కోరుకున్న సమయంలోనే ఉప ఎన్నిక వస్తుందన్నది కూడా సత్యం. నిజానికి మునుగోడు ఉప ఎన్నికను బీజేపీనే తీసుకొచ్చింది. అయినా ఉప ఎన్నిక ఎప్పుడు జరపాలన్న దానిపై ఆ పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయని సమాచారం.
మునుగోడులో విజయంపై కమలం పార్టీలో ధీమా ఉన్న తొందరపడకూడదనే భావనలో ఉన్నారని అంటున్నారు. మునుగోడులో బీజేపీ పార్టీ బలహీనంగానే ఉన్నా కోమటిరెడ్డి రాకతో సీన్ మారుతోంది. ఇప్పటికే వందలాది మంది కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నేతలు కమలం గూటికి చేరిపోయారు. అధికార టీఆర్ఎస్ నేతలు కూడా కోమటిరెడ్డికి జై కొట్టారు. చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలోనే తిరుగుతున్న రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలోకి నేతల చేరికలు కొనసాగుతున్నాయి. మునుగోడులో బీజేపీ హైకమాండ్ చేయించిన సర్వేలోనే పరిస్థితి సానుకూలంగానే ఉందని వచ్చిందట. అయినా మునుగోడు విషయంలో ఆచితూచి దోరణిలోనే కమలం పార్టీ ఉందంటున్నారు. పార్టీలో చేరిన నేతలు కొందరు తిరిగి సొంత గూటికి వెళుతున్నారు. దీంతో పార్టీలో చేరిన సర్పంచ్ లు, ఎంపీటీసీల విషయంలో పూర్తి నమ్మకం కల్గడం లేదంటున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో కొందరు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు సర్పంచ్ లు పార్టీలో చేరుతున్నా... వాళ్లతో పాటు కేడర్ పూర్తిగా రాకపోవడం కూడా బీజేపీని అంతర్మథనంలో పడేస్తుందని అంటున్నారు. తొందరపడి నిర్ణయం తీసుకున్నారా... ఎన్నికలో తేడా కొడితే మొదటికి మోసం వస్తుందనే ఆందోళన కమలనాధుల్లో ఉందంటున్నారు.
ఆగస్టు 6న ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం ఫిబ్రవరి వరకు ఉప ఎన్నికకు గడువుంది. ఇంకా చాలా సమయం ఉన్నందున తొందర వద్దని కొందరు నేతలు సూచిస్తున్నారట. నవంబర్ లో హిమాచల్ ప్రదేశ్, డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి సానుకూల పరిస్థితులే ఉన్నాయి. దీంతో ఆ ఎన్నికల్లో గెలిస్తే పార్టీకి మరింత బూస్త్ వస్తుందని.. ఆ తర్వాత మునుగోడు బైపోల్ జరిపితే బాగుంటుందని కొందరు నేతలు చెబుతున్నారట. మరికొందరు మాత్రం ప్రస్తుతం మునుగోడులో బీజేపీ క్రేజీ ఉందని... ఆలస్యం జరిగితే పరిస్థితులు మారిపోవచ్చని వాదిస్తున్నారట. అధికార పార్టీకి ఎక్కువ సమయం ఇవ్వడం సరికాదని చెబుతున్నారట. అధికార టీఆర్ఎస్ డిఫెన్సులో ఉన్నప్పుడే పోలింగ్ జరిగితే బాగుంటుందని స్పష్టం చేస్తున్నారట. అయితే మెజార్టీ నేతలు మాత్రం ఫిబ్రవరి వరకు గడువు ఉన్నందున... వీలైనంత ఆలస్యంగా నిర్వహిస్తేనే మంచిదన్న అభిప్రాయమే ఎక్కువ మంది కమలం నేతలు చెబుతున్నారని అంటున్నారు.
మరోవైపు దసరా తర్వాత అసెంబ్లీ రద్దుపై సీఎం కేసీఆర్ క్షణమైనా నిర్ణయం తీసుకోవచ్చనే చర్చలు సాగుతున్నాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది.. అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాలే జనాలతో పాటు పార్టీల కేడర్ ను గందరగోళంలో పడేస్తున్నాయి.
Read also: Delhi Liquor Scam:లిక్కర్ స్కాంలో కవిత జైలుకేనా? ఈడీ చేతిలో రామచంద్ర పిళ్ళైతో బిజినెస్ డీల్ చిట్టా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook