ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఒరిస్సాతో పాటు తెలంగాణలో కూడా పలు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని.. అదే కాకుండా పలు పర్యావరణ ఇబ్బందులు ఉన్నాయని.. అందుకే ఈ ప్రాజెక్టు పట్ల వ్యతిరేకత కనబరుస్తున్న ఒరిస్సా ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఇదే విషయంపై తాను, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సుదీర్ఘంగా చర్చించానని ఆయన తెలిపారు.


ఇప్పటికే ఈ విషయంపై ఒరిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసిందని.. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అని తర్జనభర్జనలు పడుతుందని కడియం శ్రీహరి తెలిపారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కూడా ఈ ప్రాజెక్టుపై వ్యతిరేకత కనబరుస్తుందని ఆయన తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై వ్యతిరేకతతో ఉందని ఆయన చెప్పారు.