టీ-కాంగ్రెస్‌కి కోలుకోలేని షాక్.. టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏదైతే జరగకూడదని ఆ పార్టీ భయపడుతూ వస్తుందో.. తాజాగా అదే జరిగింది.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏదైతే జరగకూడదని ఆ పార్టీ భయపడుతూ వస్తుందో.. తాజాగా అదే జరిగింది. సీఎల్పీని విలీనం చేయాలని కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఆ 12 మంది ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ సీఎల్పీనీ టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. అనంతరం విలీన ప్రక్రియ పూర్తయినట్లు శాసనసభలోని అధికారవర్గాల నుంచి నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు కార్యదర్శి బులిటెన్‌లో పేర్కొన్నారు. తాజా పరిణామంతో శాసనసభలో టీఆర్‌ఎస్ బలం 102 కు చేరినట్టయింది.
సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియ, జాజుల సురేందర్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య వంటి ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.
2018 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికవగా వారిలో దశల వారీగా మొత్తం 12 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారమే హుజుర్‌నగర్ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలివున్నారు. దీంతో ఏ క్షణం ఎవరు చేజారిపోతారోననే భయాందోళనలో కాంగ్రెస్ బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో పార్టీల వారీగా వున్న ఎమ్మెల్యేల సంఖ్య ఇలా వుంది.
టీఆర్ఎస్-102
ఏఐఎంఐఎం-7
కాంగ్రెస్ -6
టీడీపీ-2
బీజేపి-1
మొత్తం-118