BJP slams TRS | త్వరలోనే తెలంగాణలో బీజేపీ బ్రహ్మాస్త్రం: లక్ష్మణ్
తెలంగాణ సర్కార్ టిఎస్ఆర్టీసీ(TSRTC)ని నిర్వీర్యం చేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసినట్లుగానే ఆ తర్వాత సింగరేణి(Singareni)ని కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని లక్ష్మణ్ ఆరోపించారు.
కరీంనగర్: తెలంగాణ సర్కార్ టిఎస్ఆర్టీసీ(TSRTC)ని నిర్వీర్యం చేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసినట్లుగానే ఆ తర్వాత సింగరేణి(Singareni)ని కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని లక్ష్మణ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామగుండం కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసిన లక్ష్మణ్.. త్వరలోనే బీజేపీ రాష్ట్రంలో ఓ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతోందన్నారు. అయితే, ఆ బ్రహ్మాస్త్రం ఏంటి, ఎప్పుడు ప్రయోగిస్తారనే వివరాలను మాత్రం లక్ష్మణ్ వెల్లడించలేదు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన లక్ష్మణ్.. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకొని సీఎం కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్‌పై లక్ష్మణ్ చేసిన విమర్శల సంగతిని పక్కనపెడితే.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని బీజేపి మొదటి నుంచీ చెబుతూవస్తోన్న సంగతి తెలిసిందే. ఇదేకాకుండా హైదరాబాద్‌ని దేశానికి రెండో రాజధానిగానూ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇటీవల ఓ టాక్ తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ చేసిన 'బ్రహ్మస్త్రం' వ్యాఖ్యలే ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. టీఆర్ఎస్‌ను లక్ష్మణ్ ఎప్పుడూ విమర్శించినట్టుగానే ఈసారి కూడా విమర్శించారా లేక ఆయన వ్యాఖ్యల వెనుక ఇంకేమైనా మతలబు ఉందా అనే సందేహాలూ కలుగుతున్నాయి. ఏదేమైనా.. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో నాలుగు లోక్ సభ స్థానాలు గెల్చుకున్న బీజేపి.. మునుపటి కంటే ఒకింత జోష్‌తోనే కనిపిస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు.