హైదరాబాద్: నేడు తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఓవైపు ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే మరోవైపు ఆర్థిక శాఖ మంత్రిగా తొలిసారి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌.. బడ్జెట్ ప్రతులను పూర్తిగా చదివి వినిపించారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్రాభివృద్ధికి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్న ఆయన.. రాష్ర్టం ఏర్పడిన తర్వాత మొదటి నాలుగున్నరేళ్లలో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకోవడమే కాకుండా అత్యధికంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ర్టంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని సభకు తెలిపారు. రైతన్నకు మేలు చేకూర్చే విధంగా సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుని నీటిపారుదల శాఖకు రూ. 22,500 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు, అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కోసం రూ. 12,000 కోట్లతోపాటు రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.


తెలంగాణ బడ్జెట్ సారాంశం నుంచి పలు ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.
2019-20లో సొంత రెవెన్యూ రాబడుల అంచనా రూ. 94,776 కోట్లు
2019-20లో కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనా రూ. 22,835 కోట్లు
2019-20లో ప్రగతి పద్దు రూ. 1,07,302 కోట్లు
నిర్వహణ పద్దు రూ. 74,715 కోట్లు
షెడ్యూలు కులాల అభివృద్ధి కోసం రూ. 16,581 కోట్లు నిధులు
ఆసరా పింఛన్ల కోసం రూ. 12,067 కోట్లు
షెడ్యూల్ తెగల అభివృద్ధి కోసం రూ. 9,827 కోట్లు
సబ్సీడీ బియ్యం రాయితీ కోసం రూ. 2,744 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2004 కోట్లు
నిరుద్యోగ భృతి కోసం రూ. 1,810 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 1450 కోట్లు
ఎంబీసీ కార్పొరేషన్ అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు
2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 10.4 శాతం
2017-18లో మొత్తం వ్యయం రూ. 1,43,133 కోట్లు
2017-18లో రెవెన్యూ మిగులు రూ. 3,459 కోట్లు
2018-19 సంవరించిన అంచనా వ్యయం రూ. 1,61,857 కోట్లు
పంచాయతీలకు 2 ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి రూ. 3,256 కోట్ల కేటాయింపులు
ఒక్కో మనిషికి రూ.1,606 చొప్పున ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు విడుదల చేస్తామని ప్రకటన
500 జనాభా కలిగిన గ్రామానికి రూ. 8 లక్షల నిధులు కేటాయింపు
రైతు బీమా కోసం రూ. 650 కోట్లు
2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న రూ. లక్ష వరకు పంట రుణాలు మాఫీ
రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు
మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు
రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు
ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు ఉంటుందని అంచనా.