Telangana Cabinet Meeting Decisions: తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం జరుపుకున్న అనంతరం ఇవాళ కొత్త సచివాలయంలో తొలిసారిగా తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. ఈ కేబినెట్ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఆ కీలక నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి. 
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి అని కేబినెట్ నిర్ణయం.


తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావస్తున్న నేపథ్యంలో కులవృత్తులపై ఆధారపడిన వారి అభివృద్ధి కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించేలా ప్లాన్ చేసిన ప్రభుత్వం.. ఈ కార్యక్రమం అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అవసరమైన విధివిధానాలు రూపొందించే బాధ్యతను మంత్రి గంగుల ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్‌కమిటికి అప్పగించినట్టు వెల్లడించిన మంత్రులు.


84 గ్రామాలకు చెందిన ప్రజల విజ్ఞప్తుల మేరకు 111 జీఓను పూర్తిగా ఎత్తివేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో HMDA పరిధిలోని భూముల వలే, ఈ 84 గ్రామాలకు కూడా అవే నియమ నిబంధనలు వర్తించనున్నాయి. 


హిమాయత్ సాగర్, గండిపేట మంచి నీటి జలాశయాలు పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు మూసి నదిని కాళేశ్వరం జలాలతో లింక్ చేయాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.


ఆరోగ్య శాఖలో రీ ఆర్గనైజింగ్ , కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాలతో కలిపి మొత్తం 33 జిల్లాలకు జిల్లా వైద్యాధికారి ( DMHO ) పోస్టులను శాంక్షన్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అదే సమయంలో హైదరాబాద్ పట్టణ జనాభాను దృష్టిలో పెట్టుకుని వారికి లోటుపాట్లు లేని విధంగా మరిన్ని వైద్య సేవలు అందేలా GHMC పరిధిలో ఉన్న 6 జోన్లకు అనుగుణంగా 6 DMHO లు పనిచేయనున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం 38 DMHO లు సేవలు అందించేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.


అలాగే 40 మండలాల్లో కొత్త PHC మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించినట్టు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. అర్బన్ PHC లలో ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తుండగా.. వారి స్థానంలో పర్మినెంట్ బేసిస్ లో ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు.


వ్యవసాయ రంగంలో మార్పుల కోసం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వడగళ్ల వాన వల్ల రైతులు ఎంతో నష్ట పోయారు. అందుకే ఆ నష్టాన్ని నివారించేందుకు రానున్న కాలంలో పంట కాలాన్ని ఒక నెల ముందుకి జరపాలని ప్రణాళిక రచిస్తున్నట్టు మంత్రులు పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకే నెల ముందు పంట జరపాలని యోచిస్తున్నట్టు మంత్రులు స్పష్టంచేశారు. అయితే, ఈ ప్రక్రియను శాస్త్రీయంగా ఎలా ముందుకు జరపాలి అనే అంశంపై మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.


రైతులను భారీగా నష్టపోయేలా చేస్తోన్న నకిలీ విత్తనాలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు మీడియాకు తెలిపారు. నకిలీ విత్తనాలు తయారీ చేసే వారిపై, విక్రయించే వారిపై పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు వెల్లడించారు. రైతులను మోసం చేసే వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఒక్క రైతు కూడా మోసపోవద్దు. దీనిపై కూడా కేబినెట్ సబ్ కమిటీ పని చేస్తుంది అని అన్నారు.


అలాగే మక్కలు, జొన్నలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం తరుపున గ్యారెంటీ ఇస్తూ నిర్ణయం తీసుకోవడం, అచ్చంపేట ఉమా మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్ 1, ఫేస్ 2 అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 


ఇప్పటికే ఎంతో కాలంగా తమని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తోన్న వీఆర్ఏలకు ఈ కేబినెట్ భేటీలో సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు. VRA లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న సర్కారు.. విధివిధానాలు ఖరారు చేయాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీచేసింది. ఇది వీఆర్ఏలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.


మరో 15 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకుంది. 


వనపర్తి జిల్లా కేంద్రంలోని జర్నలిస్టు అసోసియేషన్‌కు 10 గుంటల స్థలం కేటాయించడంతో పాటు ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాలు స్థలం కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 
జైన్ కమ్యూనిటీ వర్గాన్ని మైనార్టీ కమిషన్‌లో చేర్చుతూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో పాటు కమిషన్ సభ్యులుగా ఒకరికి అవకాశం కూడా కల్పిస్తున్నట్టు స్పష్టంచేసింది. 


పేపర్ లీకేజ్ స్కామ్ కేసుతో పీకల్లోతు వివాదాలు, ఆరోపణల్లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) లో 10 పోస్టుల మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.