ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ ముగిసింది. దాదాపు 50 నిమిషాలపాటు కొనసాగిన ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన పది ప్రధాన అంశాలు, సమస్యలపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ చర్చించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, సచివాలయం నిర్మాణానికి హైదరాబాద్ నగరంలోని రక్షణ శాఖ స్థలాల కేటాయింపు, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ. 20 వేల కోట్ల ఆర్థిక సహాయం, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధుల విడుదల, కరీంనగర్‌లో ఐఐఐటీ ఏర్పాటు, ఐఐఎం మంజూరు, ఐటీఐఆర్‌కు నిధులు, కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో కేంద్ర మానవ వనరుల విభాగం పరిధిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం వంటి అంశాలపై కేసీఆర్ ప్రధాని మోదీకి వినతులు అందించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి కూడా పాల్గొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తులపై ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి సాధ్యమయ్యే వాటికి వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామని మోదీ హమీ ఇచ్చినట్టు సమాచారం.