ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ముందస్తు వ్యూహాలు ?
2018-19 బడ్జెట్ తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాలపై దృష్టి పెట్టాల్సిందిగా నేతలకు సూచించారని తెలుస్తోంది.
2017 ఆఖరిలోగా పార్లమెంట్‌తోపాటు అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగే అవకాశాలు ఉన్నాయని, ఆ ఎన్నికలని ఎదుర్కొనడానికి టీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు. 2018-19 బడ్జెట్ తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాలపై దృష్టి పెట్టాల్సిందిగా నేతలకు సూచించారని తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే, అందుకు అనుగుణంగానే తెలంగాణలో కూడా ఎన్నికలు తప్పవని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే, ఇప్పటికే తాను చేయించిన అన్నిరకాల సర్వేల్లో పరిస్థితులు టీఆర్ఎస్‌కు అనుకూలంగానే ఉన్నాయని, కాకపోతే కొన్ని చోట్ల చిన్నచిన్న లోపాలు సరిదిద్దుకోవాల్సిన అవసరం వుందని పార్టీ శ్రేణులని అప్రమత్తం చేశారని పార్టీ వర్గాలు వెల్లడించినట్టు మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి.
మరో ఎనిమిది రాష్ట్రాలకు వచ్చే ఏడాది జూన్‌లోగా ఎన్నికలు జరగాల్సి వున్న నేపథ్యంలో నిర్ణీత సమయంకన్నా ఆరు నెలల ముందుగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ యోచిస్తున్న సంగతిని ప్రస్తావించిన కేసీఆర్.. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి పూర్తి కానుందని, దేశమంతా ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలంటే, 2017లోనే 13 రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడం తప్పనిసరి అని ఆయన పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు:
ఇదిలావుంటే, నియోజకవర్గాల పునర్విభజన అంశంపై స్పందిస్తూ.. ఈ నెల 15న జరిగే కేంద్ర క్యాబినెట్ భేటీలో నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత లభించే అవకాశం వుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేసినట్టు వినికిడి