పవన్ కల్యాణ్‌తో కేసీఆర్ స్నేహం అందుకే : వీహెచ్
తాను ఊహించినట్టుగానే కేసీఆర్, పవన్ కల్యాణ్‌కి గాలం వేస్తున్నారని వ్యాఖ్యానించారు వీహెచ్.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కి సినీనటుడు పవన్ కల్యాణ్‌తో అవసరం వుందని, అతడి వెనుకున్న అభిమానబలగాన్ని, ఆయన సొంత వర్గమైన కాపులని అక్కున చేర్చుకునేందుకే కేసీఆర్ పవన్‌తో స్నేహం చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత వీ హన్మంత రావు. 'ఒకానొకప్పుడు సినిమా యాక్టర్ పవన్ కల్యాణ్ అంటే ఎవడా పవన్ కల్యాణ్' అని సంబోధించిన కేసీఆర్ మొన్న అదే వ్యక్తితో భేటీ అవడంలో ఆంతర్యం ఏంటో అర్థం చేసుకోవడం పెద్దగా కష్టమైన పనేమీ కాదని అన్నారు. బుధవారం ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌తో కేసీఆర్ సన్నిహితంగా వుండే అవకాశాలున్నాయని తాను ముందే ఊహించాను. అనుకున్నట్టుగానే కేసీఆర్, పవన్ కల్యాణ్‌కి గాలం వేస్తున్నారని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్‌ని అక్కున చేర్చుకోవడం ద్వారా తెలంగాణలో వున్న కాపుల ఓట్లు టీఆర్ఎస్‌కి పడతాయనేది కేసీఆర్ వ్యూహంగా వీహెచ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మున్ముందు పవన్ కల్యాణ్ కేవలం ఏపీకే పరిమితం అవుతారా లేక తన పార్టీని తెలంగాణకు కూడా విస్తరించి టీఆర్ఎస్‌కి ముప్పుని తీసుకొస్తారా అనే భయం కూడా కేసీఆర్‌కి వుండి వుంటుంది. పవన్‌తో కేసీఆర్ స్నేహంగా వుండాలని అనుకోవడానికి అది కూడా ఓ కారణమై వుండొచ్చని తన అనుమానాలని బయటపెట్టారు వీహెచ్. వీహెచ్ చేసిన ఈ ఆరోపణలని టీఆర్ఎస్ పార్టీ తేలిగ్గా తీసుకుంటుందా లేక ఖండించే ప్రయత్నం చేస్తుందా వేచిచూడాల్సిందే మరి!