హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం నివాసం వుంటున్న ఇల్లు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ పరిజ్ఞానంతో నిర్మించి వుంది. అయితే, ఇదే కాకుండా సీఎం కేసీఆర్ కోసం మరో బుల్లెట్ ప్రూఫ్ నివాసం నిర్మాణం కానుందని తెలుస్తోంది. ది హన్స్ ఇండియా న్యూస్ పోర్టల్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలో కేసీఆర్ కోసం ఓ బుల్లెట్ ప్రూఫ్ నివాసం నిర్మించేందుకు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది యోచిస్తున్నట్టు సమాచారం. అందుకోసం తెలంగాణ సర్కార్ నుంచి రూ. 2 కోట్ల నిధులు అదనంగా మంజూరైనట్టుగాను ఆ కథనం పేర్కొంది.


ఈ ఇంటికి ఏర్పాటు చేసిన కిటీకీ అద్దాలు, ద్వారాల తలుపుల కోసం మొత్తం బుల్లెట్ ప్రూఫ్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంకొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చేపట్టనున్న పర్యటన కోసం కూడా ఓ బుల్లెట్ ప్రూఫ్ బస్సుని సిద్దం చేయనున్నట్టు ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి వుంటుందనే అనుమానంతోనే ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.