శంషాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికీ దేశ ప్రధానిగానే ఉండాలని మీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోరుకుంటున్నారు అని రాహుల్ గాంధీ అన్నారు. ఎందుకంటే, కేసీఆర్ అవినీతి, అక్రమాల గురించి నరేంద్ర మోదీకి అంతా తెలుసు. అందుకే నరేంద్ర మోదీ ఎలా చెబితే, కేసీఆర్ అలా వింటారు అని చెబుతూ కేసీఆర్ రిమోట్ నరేంద్ర మోదీ చేతుల్లో ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శంషాబాద్‌లో నేడు జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. శంషాబాద్ సభా వేదికపై నుంచి కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్, తెలంగాణ కేసీఆర్ సర్కార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 


''పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ మద్దతిచ్చారు. కానీ నోట్ల రద్దుతో దేశంలో కోట్లాది మంది నష్టపోయారు. అలాగే జీఎస్టీ విషయంలోనూ మోదీని కేసీఆర్ సమర్థించారు. మోదీ చేస్తోన్న దుర్మార్గాలకు కేసీఆర్‌ మద్దతిస్తూ వస్తున్నారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలోనూ  రాఫెల్‌ వ్యయాన్ని రూ.1600 కోట్లకు పెంచి ఆ మొత్తాన్ని అంబానీకి దోచిపెట్టే యత్నం చేశారు. అంబానీ గతంలో ఎప్పుడూ యుద్ధ విమానాల్ని తయారు చేయలేదు. 70 ఏళ్లుగా విమానాలు తయారు చేస్తోన్న చరిత్ర కలిగిన హెచ్‌ఏఎల్‌ సంస్థను పక్కనపెట్టి అంబానికి ఈ ప్రాజెక్టు అప్పగించాలని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ గారు ఒక్కసారైనా ప్రశ్నించారా అని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నిలదీశారు.