హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పష్టమైన నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను పక్కనపెడితేనే వారి డిమాండ్లను పరిశీలించాలని.. లేదంటే అవసరమే లేదని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై పట్టుబట్టబోమని కార్మికుల తరపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి హై కోర్టులో వాదనల సందర్భంగా కోర్టుకు చెప్పారని.. హైకోర్టు సైతం ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించినందున తాము ముందు నుంచీ చెబుతున్నట్టుగానే తాము సైతం ఆ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒక విధంగా ఇక్కడే కార్మికులు విలీనం డిమాండ్‌ను వదులుకున్నట్లయిందని ప్రభుత్వం అభిప్రాయపడింది. 


ఇక ఇప్పుడు తమ ముందున్న తక్షణ కర్తవ్యం కోర్టు ఆదేశాల మేరకు కార్మికుల 21డిమాండ్లపై అధ్యయనం చేసి కోర్టుకు నివేదిక సమర్పించడం.. విలీనం డిమాండ్ మినహా ఇతర డిమాండ్లపై ఆర్టీసీ కార్మికులతో చర్చించడమేనని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.