Covid-19 cases in Telangana: హైదరాబాద్‌ : తెలంగాణలో గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచారు. మరోవైపు రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తగ్గి కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టినట్టు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ స్పష్టంచేసింది. గత 24 గంటల్లో 1,00,677 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 2,982 మందికి క‌రోనావైరస్ సోకినట్టు గుర్తించారు. అదే సమయంలో 3,837 మంది కరోనా వైర‌స్ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా మరో  21 మంది కరోనాతో చనిపోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌ శాఖ‌ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 3247 మందికి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో శనివారం వరకు గుర్తించిన కరోనా కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య మొత్తం  5,74,026 కు చేరింది. ఇప్పటివరకు 5,33,862 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36,917 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులపైనా (Black fungus cases) రాష్ట్ర ప్రభుత్వం ఆరాతీస్తోంది. ఎప్పటికప్పుడు జిల్లాల నుంచి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే నివేదికలు తెప్పించుకుంటున్న తెలంగాణ సర్కారు.. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ (White fungus symptoms) లాంటి వ్యాధుల లక్షణాలతో ఎవరైనా బాధపడుతున్నట్టయితే వారికి తగిన చికిత్స అందిస్తూ ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిందిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీచేసింది.