న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉన్న ఐజీఎస్టీ నిధులను(IGST funds) కేంద్రం విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన రూ.35,298 కోట్ల నిధులలో భాగంగానే తెలంగాణకు రావాల్సి ఉన్న రూ.1,036 కోట్లను సైతం విడుదల చేసినట్టు కేంద్రం ప్రకటించింది. ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, టీఆర్‌ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తెలంగాణకు రావాల్సి ఉన్న ఐజీఎస్టీ బకాయిలు సహా ఇతర నిధులను వెంటనే విడుదల చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్‌ చేశారు. అదే రోజున టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత కూడా నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేస్తోందంటూ ట్విటర్ ద్వారా నిరసన వ్యక్తంచేశారు. 


నిరసన అనంతరం టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను(FM Nirmala Sitharaman) కలిసి తెలంగాణలోని ఆర్థిక ఇబ్బందులను వివరించారు. తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని కోరిన ఎంపీలు.. నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యం రాష్ట్రాభివృద్ధిపై కూడా ప్రభావం చూపిస్తోందని ఆమెకు వివరించారు.