భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కేరళకు తమ వంతు సహాయంగా తెలంగాణ సర్కార్ తరపున రూ. 25 కోట్ల తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. రూ.25 కోట్ల మొత్తాన్ని తక్షణమే కేరళ సర్కార్‌కి అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషిని కేసీఆర్ ఆదేశించారు. వరదల కారణంగా తాగు నీటి సరఫరా పూర్తిగా దెబ్బతిన్నందున వరద బాధితుల నీటి కష్టాలు తీర్చేలా నీటిని శుద్ధి చేసే రూ.2.5 కోట్ల విలువైన ఆర్వో మెషిన్లను కేరళకు పంపించాల్సిందిగా సంబంధిత అధికార యంత్రాంగానికి సూచించారు. ఇదేకాకుండా 100 మెట్రిక్‌ టన్నుల బాలామృతంను కేరళ పంపించేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేసింది. ఈ సరుకును బేగంపేట విమానాశ్రయం నుంచి రక్షణశాఖకు చెందిన ప్రత్యేక విమానంలో కేరళ తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ పారిశ్రామిక వేత్తలు, ఐటీ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలతోపాటు ఇతరరంగాలకు చెందిన వారు సైతం ఇతోధిక సాయం అందించడానికి ముందుకు రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఘోర విపత్తు నుంచి కేరళ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు. కేరళ వరద బాధితులను ఆదుకుని, వారికి ఆపన్నహస్తం అందించేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తిచేశారు. 

 

ఇదిలావుంటే, మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు సైతం తమవంతుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేరళకు రూ.10 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు.