Telangana Schools Closed: తెలంగాణలో స్కూళ్లకు సెలవులు.. లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన!
Telangana Schools Closed: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా జనవరి 8 నుంచి 16 వరకు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడే లాక్ డౌన్, కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ కు వివరించారు.
Telangana Schools Closed: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. మరోవైపు మున్సిపాలీటీల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.
సీఎం కెసిఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న వైద్యాధికారులు రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా ఉండరాదని, ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా కరోనా నియంత్రించవచ్చని వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని బట్టి లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదని వారు సీఎం కు నివేదిక ఇచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. "ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో అజాగ్రత్త పనికిరాదన్నారు. నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పని చేసే దగ్గర అప్రమత్తంగా ఉంటూ మాస్క్ లు ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ నిబంధనలను పాటించాల"ని సీఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
పాఠశాలలకు సెలవులు
సమావేశంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. ఉన్నత స్థాయిలో సమీక్షలో.. సీఎం కేసీఆర్‌కు వైద్యాధికారులు నివేదిక ఇచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా గుంపులుగా ఉండరాదని నివేదికలో పేర్కొన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరారు.
బస్తీ దవాఖానాల్లో తగిన ఏర్పాట్లు
ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖను సన్నద్ధం చేయడం కోసం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న మొత్తం బెడ్లల్లో దాదాపు 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మార్చారని, మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గతంలో రాష్ట్రంలో కేవలం 140 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం మాత్రమే ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తిని ఇప్పుడు 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగామని అన్నారు.
ఆక్సిజన్ ఉత్పత్తిని 500 మెట్రిక్ టన్నుల వరకు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన వైద్యశాఖాధికారులను సీఎం కేసీఆర్ సూచించారు. హోం ఐసోలేషన్ చికిత్స కిట్లను 20 లక్షల నుంచి ఒక కోటి లభ్యతకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో డాక్టర్లు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలని, ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలని స్పష్టం చేశారు. పెరుగుతున్న జనాభా అవసరాలరీత్యా జనాభా ప్రాతిపదికన, రాష్ట్రంలో డాక్టర్లు, బెడ్లు మౌలిక వసతులను పెంచుకొని వైద్యసేవలను మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ అన్నారు.
సోమవారం ప్రగతి భవన్ లో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు టి.హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్రాం రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఎ. జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వి, అధికారులు శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 482 కరోనా కేసులు.. 84కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: One Moto India Launch: రూ.250 కోట్లతో తెలంగాణలో బ్రిటీష్ ఈ-స్కూటర్ సంస్థ ప్లాంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి