తెలంగాణ రాష్ట్రంలో ఇకమీదట రేషన్ షాపులు కనిపించకుండా పోతున్నాయా ? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు పౌరసరఫరాల శాఖ అధికారులు. రాష్ట్రంలో బియ్యం, ఇతర సరకులు లబ్దిదారులకు అందకుండా పక్కదారి పడుతున్నాయని, వాటిని చెక్ పెట్టేందుకే రేషన్ షాపులకు బదులు నగదు బదిలీ (డీబీటీ-డిపాజిట్ ఆఫ్ మనీ) ప్రవేశపెడుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నారు. 


శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పౌరసరఫరాల శాఖ ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. "రాష్ట్రంలో బియ్యము, ఇతర సరుకులు లబ్దిదారులకు అందకుండా  పక్కదారి పడుతున్నాయి. అలాంటి అవకతవకలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనువైన విధానం అమలు చేయాలి" అని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అధికారులు స్పందిస్తూ .. " కొన్ని రాష్ట్రాల్లో రేషన్ షాపులకు బదులు నగదు బదిలీ పథకం (డీబీటీ) విజయవంతంగా అమలవుతోంది.2013లో వచ్చిన ఆహార భద్రతా చట్టంలో కూడా సబ్సిడీ  ద్వారా అందించే లబ్దిని నగదు రూపంలో లబ్దిదారులకు అందించేలా సూచన కూడా ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయం కఠినంగా అమలు చేస్తే డీలర్ల అవినీతికి చెక్ పెట్టే అవకాశంతో పాటు లబ్దిదారులే నేరుగా బియ్యం కొనుక్కొనే వెసులుబాటు ఉంటుంది. అదీకాక క్యూ లైన్ లో నిల్చొనే బాధ తప్పుతుంది. లబ్ధిదారుడు తనకిష్టమొచ్చిన  సమయంలో సరుకులు కొనుక్కుంటాడు" అని తెలిపారు. ఇది అమలైతే ఒక్కో కుటుంబానికి సుమారు వెయ్యి రూపాయలు అందవచ్చని సమాచారం. ఈ డబ్బును నేరుగా బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు. ఇప్పటికే నగదు బదిలీ పథకం ఛత్తీస్ ఘడ్, పాండిచ్చేరి లో అమలవుతోంది.