TS SSC Board | హైదరాబాద్‌ : కరోనావైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో హై కోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ సర్కార్.. పదో తరగతి పరీక్షలు ( SSC Exams ) రాయకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ దిశగా జరగాల్సిన అధికారిక ప్రక్రియ అంతా ముగియడంతో త్వరలోనే పదో తరగతి విద్యార్థులకు మెమోలు అందించేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేసుకుంటోంది. వీలైతే ఈనెల 15వ తేదీ నుంచే టెన్త్ క్లాస్ షార్ట్‌ మెమోలు అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎస్ఎస్‌సి బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. ఆ తర్వాత త్వరలోనే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒరిజినల్‌ మార్కుల జాబితాను పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరీక్షలే రాయనప్పుడు ఏ ఆధారంగా మార్కులు (SSC marks) కేటాయిస్తారనే ప్రశ్నే ఇప్పుడు చాలా మంది బుర్రను తొలిచేస్తోంది. అయితే, ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్స్ (Grades in TS SSC) ఇస్తున్నందున మార్కుల కేటాయింపుపై ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. 


పరీక్షలు రాయకుండానే విద్యార్థులను పాస్ చేస్తున్నందున ఈసారి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, సప్లిమెంటరీ, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు లాంటి పరిణామాలకు కూడా తావులేకుండాపోయింది. అయితే, ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగానే గ్రేడ్స్ ఇస్తున్నందున.. ఎస్ఎస్సీ మార్కుల మెమోలు విడుదలైన తర్వాత పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన రానుందనేది మాత్రం వేచిచూడాల్సిందే.