ఆర్టీసీ కార్మిక నేతలతో చర్చలపై కీలక ప్రకటన రానుందా ?
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రగతి భవన్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం హైకోర్టు వెలువరించిన ఆదేశాల కాపీ మంగళవారమే ప్రభుత్వానికి అందింది. హైకోర్టు కాపీ అందిన నేపథ్యంలో తర్వాతి కార్యాచరణపై చర్చించేందుకు మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. హైకోర్టు కాపీని పరిశీలించి, అందులో ఉన్న అంశాలపై ఓ అవగాహనకు వచ్చిన తర్వాతే ఆర్టీసీ యూనియన్ నేతలతో చర్చలపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నేతృత్వంలో హై కోర్టు ఆర్డర్ కాపీపై ప్రగతి భవన్‌లో చర్చ జరుగుతున్నందున.. ఈ చర్చ ముగిసిన అనంతరం ఆర్టీసీ కార్మికుల సమ్మె, కార్మిక నేతలతో చర్చలపై తెలంగాణ సర్కార్ ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే,అంతకన్నా ముందుగా హైకోర్టు ఆదేశాల కాపీ అందిన వెంటనే ఆ విషయాన్ని రవాణా శాఖ మంత్రి అజయ్, ఆర్టీసీ ఎండీ, ఉన్నతాధికారులకు చెప్పిన సీఎం కేసీఆర్.. హైకోర్టు కాపీపై అధ్యయనం చేసి, అందులో కోర్టు ఏం సూచించింది ? వాటి సాధ్యసాధ్యాలపై సంబంధిత అధికారులతో చర్చించి ఓ నివేదిక తయారు చేసి ఇవ్వాల్సిందిగా మాజీ సీఎస్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మకు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మంత్రి పువ్వాడ అజయ్, ముఖ్య అధికారులతో రాజీవ్ శర్మ ప్రగతి భవన్‌లోనే సమీక్ష చేపట్టారు.