తెలంగాణలో `నో లే-అవుట్.. నో రిజిస్ట్రేషన్` పాలసి రానుందా ?
అనుమతి లేని లే-అవుట్లకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ సర్కార్ చర్యలు
తెలంగాణలోని పట్టణ ప్రాంతాల శివార్లలో విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న అక్రమ లే-అవుట్లకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే గత మూడు రోజులుగా నూతన పంచాయతీరాజ్ చట్టంపై మంత్రుల సబ్ కమిటీ చర్చలు జరిపింది. మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ముందుకు సాగుతున్న ఈ సబ్ కమిటీ బుధవారం కూడా దాదాపు ఎనిమిది గంటల పాటు సమావేశమై అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. సబ్ కమిటీలో సభ్యులుగా వున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్, జగదీశ్వర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనుమతి లేని లే అవుట్లలో నిర్మించుకునే ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ను ఆపేస్తే ఎలా ఉంటుంది ? ఆ తర్వాతి పరిణామాలు ఎలా వుంటాయనే అంశాలు, సాధ్యాసాధ్యాలపై సంబంధిత శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీతోనూ సబ్ కమిటీ ప్రత్యేకంగా చర్చించింది.
అనుమతి లేకుండా వెలుస్తున్న లే-అవుట్ల కారణంగా చివరిగా అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులే ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విషయంపైనే ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చ జరిగింది. అనుమతి లేని లే-అవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ నిలిపేస్తేనే ఇకపై అక్రమాలకు చెక్ పెట్టడానికి వీలు వుంటుందని సబ్ కమిటీ ఓ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. అదే కానీ జరిగితే అక్రమ లే-అవుట్లలో ఇటీవల ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇకపై మరిన్ని ఇక్కట్లు పడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.